ఆదివారం సాయంత్రం హఠాత్తుగా.. అనకాపల్లి టీడీపీ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్.. ఈ నెల ఇరవై ఒకటో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగింది. ఇవి ఎక్కడ పుట్టాయో కానీ… శరవేగంగా.. వ్యాపించాయి. వెంటనే ఈ ప్రచారంపై.. స్పందించిన అవంతి శ్రీనివాస్ పార్టీ మారే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. దీని వెనుక కేంద్రం కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పదకొండో తేదీ నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో… విభజన హామీలపై పోరాడుతానన్న ఉద్దేశంతోనే.. ఇలాంటి ప్రచాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ప్రజలను కోరారు.
అయితే రాజకీయాల్లో నిప్పు లేనిదే పొగ రాదని ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ.. ఇలా నిప్పు పెట్టి పొగ తెచ్చి.. మైండ్ గేమ్ ప్రారంభించే విధానం కూడా.. ఎక్కువే. ఎవరైనా పార్టీలో నాయకుడు అసంతృప్తిగా ఉన్నారని అనిపించి.. ఆ నేత తమకు ఉపయోగపడతారనుకుంటే.. మైండ్ గేమ్ ప్రారంభిస్తారు. తమ పార్టీలోకి వస్తున్నారని ప్రచారాన్ని అండర్ కరెంట్‌గా ప్రారంభించి .. చివరకు లాగేసే వరకూ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్‌పైనా అలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. పీఆర్పీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన అవంతి శ్రీనివాస్ …ఆ పార్టీ అభ్యర్థిగా భీమిలి నుంచి గెలిచారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం తర్వాత… ఆ పార్టీలో చేరారు. కానీ గత ఎన్నికల ముందు గంటాతో కలిసి.. టీడీపీలో చేరిపోయారు. కానీ భీమిలి నుచి గంటా పోటీ చేశారు. అనకాపల్లి ఎంపీగా అవంతి శ్రీనివాస్ పోటీ చేసి గెలిచారు.
అయితే.. వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి రావాలనుకుంటున్నారు. భీమిలి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారని చెబుతున్నారు. అయితే గంటా మాత్రం.. ఈ సారి కూడా భీమిలి నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ విషయంలో ఆయన పట్టుదలగా ఉన్నారు. కొద్ది రోజుల కిందట.. భీమిలి నుంచి ఆయనను మారుస్తారని ప్రచారం జరిగినప్పుడు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు కూడా..! అప్పుడు టీడీపీ నేతలు.. ఆయనకే భీమిలి టిక్కెట్ అని చెప్పి బుజ్జగించారు. దాంతో… ఎలాగైనా భీమిలి నుంచే పోటీ చేయాలన్న ఉద్దేశంతో అవంతి శ్రీనివాస్ ఇతర పార్టీల వైపు చూస్తున్నారని చెబుతున్నారు. మరి ఇది ఎంత వరకూ నిజం అవుతుందో మరి..!