మరికొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడినుండడంతో రాజకీయ పక్షాలు భేటీలతో బిజీ అయిపోయాయి. ఒకవేళ తమ పార్టీకి లేదా తమ కూటమికి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోతే ఏం చేయాలన్న దానిపై వ్యూహ రచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకం అయింది.
ఈరోజు మధ్యాహ్నం కెసిఆర్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తో భేటీ కానున్నారు. ఫలితాల అనంతరం పరస్పరం సహకరించుకొనే దిశగా చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కూడా ఎంఐఎం తాము పోటీ చేయని స్థానాల్లో టిఆర్ఎస్ కు ఓటు వేయాల్సిందిగా ముస్లింలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్విస్ట్ ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ కూడా కూటమిలోని కి ఎంఐఎం ని ఆహ్వానించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈరోజు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన కూటమి నేతలు ఒకవేళ ఏ పక్షానికీ కూడా మెజారిటీ రాకపోతే కూటమిని ముందు గవర్నర్ ఆహ్వానించేలా కోరనున్నట్టు తెలుస్తోంది. ఎంఐఎం ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడినప్పటికీ అధికారికంగా అది టీఆర్ఎస్తో పాటు కూటమి కట్టలేదు. కాబట్టి ఎంఐఎం పార్టీ, ఫలితాలకు ముందే తమతో ఉన్నట్టుగా గవర్నర్ వద్ద చూపించగలిగితే, ఫలితాల అనంతరం సులువుగా ఉంటుందని కూటమి నేతలు భావిస్తున్నారు.
అయితే ఇదంతా చూస్తుంటే ఆ మధ్య అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలు నిజం అవుతున్నట్లు కనిపిస్తోంది. హంగ్ పరిస్థితులు ఏర్పడితే తమ పార్టీ నుంచి సీఎం కూడా అయ్యే అవకాశం ఉందని, కింగ్ మేకర్ లు గా కాదని సాక్షాత్తు కింగ్ గానే తాము అవతరించగలమని ఆమధ్య ఓవైసీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎంఐఎం నేతలు కన్న కుమారస్వామి కలలు నిజమయ్యే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అయితే తుది ఫలితాలు వచ్చిన అనంతరం రాజకీయ సమీకరణాలు ఏవిధంగా మారతాయనేది వేచిచూడాల్సి ఉంది.