కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. ఆ బీజేపీ .. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయడానికి ఏమైనా చేస్తుంది. రాజ్యాంగ వ్యవస్థలను కూడా వదిలి పెట్టదు. ఆ విషయం కర్ణాటకలో తేలిపోయింది. ఇప్పుడు తెలంగాణలోనూ.. హంగ్ వస్తుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పోరాడుతోంది. బీజేపీకి అప్రకటిత మిత్రపక్షం టీఆర్ఎస్ రేసులో ఉంది. టీఆర్ఎస్ కోసం కాకపోయినా… కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలంటే… ఆ పార్టీని అధికారానికి దూరం చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇందు కోసం.. కేంద్రానికి బాగా ఉపయోగపడేది గవర్నర్ నరసింహనే.
గవర్నర్ నరసింహన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఎజెంటుగా మారారనేది.. కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఒక వేళ.. కూటమికి ఎక్కువ సీట్లు వచ్చినా… కాంగ్రెస్కు 50 వచ్చి.. టీఆర్ఎస్కు 51 సీట్లు వస్తే… ఏదో నిబంధనలు చూపించి.. టీఆర్ఎస్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారన్న అనుమానం కాంగ్రెస్ నేతల్లో ఉంది. కూటమిని గుర్తించడం లేదని చెప్పి.. అతి పెద్ద పార్టీకి అవకాశం ఇస్తానని ఆయన సమర్థించుకునే అవకాశం ఉంది. అందుకే.. ప్రజాకూటమి నేతలు.. ముందుగానే గవర్నర్ను కలిసి.. తమతందా ఓ కూటమిని చెప్పబోతున్నారు. ఆ తర్వాత గవర్నర్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నా.. ప్రజల ముందు పెట్టవచ్చన్నది కాంగ్రెస్ నేతల ఆలోచన. కర్ణాటకలో గవర్నర్ ఇదే తరహా రాజకీయం నడిపారు.
మరో వైపు పోలీసులు మొదటి నుంచి టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. రేపు హంగ్ అంటూ వస్తే.. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. రేవంత్ రెడ్డి వ్యవహారంలో వ్యవహరించినట్లుగా పోలీసుల తీరు ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి క్లిష్టమే. అందుకే ముందుగా వారు.. డీజీపీని కలిసి… నిష్పక్షిపాతంగా వ్యవహరించాలనే ఒత్తిడి తెచ్చేలా.. తమ నేతలపై దాడుల గురించి ఫిర్యాదులు చేశారు. కర్ణాటకలో కౌంటింగ్ ముగిసే వరకూ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకోలేదు.., అందుకే గందరగోళపడింది. కానీ ఈ సారి మాత్రం… చాలా మందుగానే కార్యాచరణ ప్రారంభించింది. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంది. మరి ఎంత వరకూ ఉపయోగపడతాయో.. రేపు పది గంటలకల్లా తేలిపోనుంది..!