అన్నీ ఉన్నా – అల్లుడి నోట్లో శని అని.. పాత సామెత మన అల్లుడు శీను విషయంలో నిజం అవుతూ వస్తోంది. తాజాగా.. ‘కవచం’ కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోవడంతో.. బెల్లం కొండ శ్రీనివాస్ సహజంగానే మరింత డీలా పడ్డాడు. వి.వి.వినాయక్. బోయపాటి శ్రీను, శ్రీవాస్ లాంటి ఘనాపాటిలను రంగంలోకి దించి సినిమాలు చేశాడు. స్పీడున్నోడు తీసిన భీమనేని ఏమైనా తక్కువోడా.. అంతకు ముందే `సుడిగాడు`లాంటి సూపర్ హిట్టు ఇచ్చినవాడు. రీమేక్ సినిమాలు తీయడంలో కింగు. ఇంతమంది దర్శకుల్ని పెట్టుకున్నా లాభం లేకుండా పోయింది.
సమంత, తమన్నా, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్… ఇంతమంది కథానాయికల్ని రంగంలోకి దింపినా… ప్రయోజనం లేకుండా పోయింది. టెక్నికల్‌గానూ బెల్లం కొండ సినిమాలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. దేవిశ్రీ, తమన్ లాంటి స్టార్ సంగీత దర్శకుల్ని ఎంచుకుంటాడు. నిర్మాణ పరంగా క్వాలిటీలో ఎలాంటి లోపాలు ఉండవు. పబ్లిసిటీ అయితే మరీ భీకరంగా చేస్తుంటాడు. పబ్లిసిటీ వ్యవహారం మొత్తం బెల్లంకొండ సురేష్ ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి. అయినా సరే ఒక్క హిట్టు కూడా చూడలేకపోయాడు.
సినిమాకి కావల్సింది ఆర్భాటాలు కాదన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే బెల్లంకొండ అలాంటి ఆర్భాటాలనే ఎక్కువగా నమ్ముకుంటున్నాడు. సైలెంట్‌గా సినిమా తీసి, హిట్లు మీద హిట్లు కొడుతోంది యువతరం. ఈ దశలో స్టార్ల వల్ల కాని అద్భుతాలు కొత్తతరం చేసి చూపిస్తోంది. బెల్లంకొండ చేయాల్సింది అదే. స్టార్లని కాకుండా కంటెంట్‌ని నమ్ముకోవాలి. ‘కవచం’తో ఆ ప్రయత్నం జరిగింది. ఓ కొత్త దర్శకుడితో కలసి పనిచేశాడు. కానీ ఫలితం శూన్యం. అయితే ఈ ప్రయత్నం ఆగకూడదు.
వెంటనే తేజ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోంది. బెల్లంకొండ కెరీర్‌ని డిసైడ్ చేసే సినిమా అది. అదృష్టం కొద్దీ తేజ ఫామ్‌లో ఉన్నాడు. కాకపోతే… తేజ నుంచి ఎప్పుడు ఎలాంటి సినిమా వస్తుందో చెప్పలేం. ఆ సినిమాని, తేజని ఎంత తక్కువ నమ్మితే అంత మంచిది. ఇప్పటికీ బెల్లంకొండ పరిస్థితి చేయి దాటిపోలేదు. అదృష్టం కొద్దీ… బెల్లంకొండకు డిజిటల్ మార్కెట్ ఏర్పడింది. హిందీ డబ్బింగ్ రూపంలో మంచి డబ్బులే వస్తున్నాయి. ఇవన్నీదృష్టిలో ఉంచుకుని, బెల్లంకొండ తన కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. కథల విషయంలోనే కాదు.. తన నటన, డైలాగులు పలికే విధానం.. వీటిలోనూ పరిణితి చూపించాలి. లేదంటే…. ఈతరం దూకుడుని తట్టుకోవడం కష్టం.