తెలంగాణలో కౌంటింగ్ సమయం దగ్గర పడే కొద్దీ… రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు గవర్నర్, పోలీసుల నుంచి తమకు ఇబ్బందులు ఎదురవుతాయేమోన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ముందస్తుగా వారిపై ఒత్తిడి పెంచే వ్యూహాలు అమలు చేస్తూండగా… టీఆర్ఎస్ ..అలాంటి సమస్యలేమీ లేకపోవడంతో…రాజకీయ వ్యూహాలను స్వేచ్చగా అమలు చేసుకుంటోంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఏం చేయాలన్న అంశంపై ఇప్పటికే…అన్ని రాజకీయ పార్టీలు కార్యాచరణ ప్రారంభించాయి. మజ్లిస్ ను వదిలేస్తే.. మద్దతివ్వడానికి తాము రెడీ అన్న బీజేపీ ఆఫర్ ను… టీఆర్ఎస్ గట్టిగా ఖండించలేదు. అదే సమయంలో.. మజ్లిస్ కూడా.. మహాకూటమికి మద్దతిస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా… ఖండన కూడా వెలువరించలేదు. దాంతో.. తెలంగాణ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చన్న అభిప్రాయం పెరిగిపోయింది.
ఈ సమయంలోనే మజ్లిస్ అధినేత అసదుద్దీన్… కేసీఆర్ తో సమావేశమయ్యారు. బుల్లెట్ పై.. ప్రగతి భవన్ కు ఒంటరిగా వెళ్లిన అసదుద్దీన్.. హంగ్ వస్తే వచ్చే పరిస్థితులపై చర్చించారు. బీజేపీ మద్దతు తీసుకుంటే.. తమ మద్దతు ఉండదన్న అంశాన్ని అసదుద్దీన్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది కానీ… ఒక వేళ రెండు పార్టీల మద్దతు అవసరం అయితే ఎలా వ్యవహరించాలన్న అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీని ప్రభుత్వంలో కలుపుకుంటే… ఎంఐఎం ఓటింగ్ లో పాల్గొనకుండా.. వాకౌట్ చేసే వ్యూహాన్ని అవలంభిస్తే చాలన్న ప్రతిపాదనల దిశగా చర్చలు జరిగినట్లు చెబుతున్నారు.
హంగ్ ఏర్పడితే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర సహకారం తప్పనిసరిగా ఉండాలని.. అదే సమయం పార్లమెంట్ ఎన్నికల నాటికి.. జాతీయ వ్యూహం ఉండాలి కాబట్టి.. బీజేపీతోనే వెళ్లాలన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు. ఈ విషయంలో.. అసదుద్దీన్ మద్దతు తమకే ఉండేలా కేసఆర్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే అసదుద్దీన్ రాజకీయం మాత్రం భిన్నంగా ఉంటుంది. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంటే వారికే మద్దతుగా నిలుస్తారు. ఇప్పుడు ఏం చేసినా.. కేసీఆర్ కు సంతోషం కలిగించడానికి తాత్కాలిక ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.