‘పరుగు ఆపడం ఒక కళ’… శోభన్ బాబు జీవితంపై వచ్చిన ఓ పుస్తకం ఇది! ఈ టైటిల్ శోభన్ బాబు పుస్తకానికి నూటికి నూరుపాళ్లూ యాప్ట్. ఎందుకంటే… సినీ ప్రయాణాన్ని ఎప్పుడ, ఎక్కడ, ఏ దశలో ఆపాలో ఆయన ముందే నిర్ణయించుకున్నారు. ‘శోభన్‌బాబుని ఇలాంటి పాత్రల్లో ఇక చూడలేం’ అని అనిపించుకోకముందే… స్వచ్ఛందంగా సినిమాలకు దూరమయ్యారు. కనీసం సినిమా వేడుకల్లోనూ ఆయన కనిపించలేదు. ఈమధ్య చాలా అవకాశాలొచ్చినా… సున్నితంగా తిరస్కరించారు. ఆయన అలా వదిలేసిన సినిమాల్లో ‘అతడు’ కూడా ఉంది.
అతడులో నాజర్ చేసిన పాత్ర ముందు ఆయన దగ్గరకే వెళ్లింది. కానీ.. శోభన్‌బాబు మరో మాట లేకుండా `నో` చెప్పేశారు. ఈ విషయాన్ని మురళీమోహన్ పాత్రికేయులతో పంచుకున్నారిప్పుడు. ”అతడు సినిమాలో శోభన్‌బాబు గారిని తీసుకోవాలని ఎంతగానో ప్రయత్నించాం. బ్లాంక్ చెక్ పంపితే… సున్నితంగా తిరస్కరించి వెనక్కి పంపారు” అని గుర్తు చేసుకున్నారు. ఆ పాత్ర చివరికి నాజర్‌కి దక్కింది. శోభన్ బాబు చేసుంటే గనుక ఏ స్థాయిలో ఉండేదో తెలీదు గానీ – నాజర్ కూడా తన వంతు న్యాయం చేశాడనే చెప్పాలి. బాలీవుడ్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘బ్లాక్’ ని తెలుగులో శోభన్‌బాబుతో రీమేక్ చేద్దామనుకున్నారు. ఈ సినిమా కోసం కోటి రూపాయల పారితోషికం ఆఫర్ చేశారు. కానీ… కోటికి కూడా శోభన్ బాబు కరగలేదు. ‘ఇక సినిమాలు వద్దు’ అని గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకే.. పారితోషికాలకు లొంగలేదు.