భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక శాఖ-ఆర్బీఐ మధ్య విభేదాలు ఇటీవల తీవ్రమైన నేపథ్యంలో ఉర్జిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుతెలుస్తోంది.నిజానికి ఆయన గత నెల 19వ తేదీన ఆర్బీఐ బోర్డు సమావేశంలో రాజీనామా చేయాలనుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ బోర్డు సమావేశంలో కేంద్రం – ఆర్బీఐ రాజీ ఫార్ములాకు వచ్చినట్లు.. ఓ ఒప్పందం చేసుకున్నట్లు… ఆర్బీఐ వద్ద ఉన్న నగదు నిల్వలను కేంద్రానికి ఇవ్వడానికి ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పుకున్నారు. అయితే హఠాత్తుగా వ్యక్తిగత కారణాలు చూపుతూ.. ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసేశారు.
ప్రభుత్వంతో విభేదించి అలసిపోవడమే కాక, వైరిపూరిత వాతావరణంలో పనిచేయడం వల్ల తన ఆరోగ్యం పాడవుతున్నదని పటేల్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో కేంద్రం… స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఆర్బీఐపై తన పెత్తనాన్ని రుద్దాలని ప్రయత్నించింది. ముఖ్యంగా రిజర్వ్‌బ్యాంక్ చట్టంలోని సెక్షన్-7 కింద ప్రభుత్వం ఆదేశాలను జారీచేసిందన్న ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్థిక సేవల రంగం వివిధ కుంభకోణాలతో సతమతమవుతున్న తరుణంలో రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ రాజీనామా చేయడం ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బేనని చెప్పుకోవచ్చు.
గతంలో ఆర్బీఐ గవర్నర్ రాజీనామా వార్తలు వచ్చినప్పుడు.. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని కాపాడుతామని కేంద్రం ప్రకటన చేసింది. ఆ సమయంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని కాపాడాల్సిందేనంటూ బహిరంగంగా ఆర్బీఐకి మద్దతు పలికారు. సీటు బెల్టులాంటి ఆర్బీఐని వాహనదారుడైన ప్రభుత్వం ధరించకపోతే ప్రమాదం చాలా తీవ్రంగానే ఉంటుందని హెచ్చరించారు. ఈ రఘురామ్ రాజన్ కూడా… బీజేపీ మార్క్ ఆర్థిక విధానాలు నచ్చకనే గవర్నర్ పదవి పొడిగింపు కోరలేదని ప్రచారం జరిగింది. నిజానికి రఘురామ్ రాజన్ ను వద్దనుకుని ఉర్జిత్ పటేల్ ను తెచ్చి పెట్టుకుంది.. నరేంద్రమోడీనే. ఇప్పుడు ఆయన కూడా.. కేంద్రం విధానాలను భరించలేకపోయారు.