ఇంకా తెలవారదేమీ, ఈ చీకటి విడిపోదేమీ..అని ఒక తెలుగు పాట. ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయ నాయకుల తో పాటు, మీడియా రాజకీయ విశ్లేషకులు , బెట్టింగ్ రాయుళ్లు, “సర్వే” జనాలతో పాటు తెలంగాణలోని సర్వజనుల పరిస్థితి ఆ పాటలో మాదిరిగానే ఉంది. ఇక కొద్ది గంటలలోనే దేశంలోని 29వ రాష్ట్రమైన తెలంగాణలో మలి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయనున్నారన్న ఉత్కంఠ కు తెర పడనుండగా, చివరికి ఎన్నికల రణ రంగం లో విజేతగా ఎవరు నిలుస్తారన్న సస్పెన్స్ ప్రజలకు ‘ఇంకా తెలవారదేమీ..’ అనిపించేలా చేస్తోంది.
ఈ ఉత్కంఠకు మరొక కారణం ఎన్నికలు ఏకపక్షంగా జరగకపోవడం. సెప్టెంబర్ 6న కెసిఆర్ ముందస్తు ఎన్నికల గురించి ప్రకటించేంత వరకు కూడా కేసీఆర్ ఎదురులేని నేతగా నే కనిపించాడు. కరెంటు, నీళ్లు లాంటి మౌలిక వసతులు అందించడంతోపాటు, జలయజ్ఞాన్ని తలపించేలా ప్రాజెక్టులు కడుతూ ఉండడంతో పాటు, అనేక అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో కేసీఆర్ సునాయాసంగా గెలుస్తాడని అభిప్రాయం మూడు నెలల క్రితం వరకు అందరిలోనూ ఉంది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ మహా కూటమి కట్టడమే కాకుండా, సీట్ల సర్దుబాటు దగ్గరనుంచి రెబెల్స్ ని బరిలో నుంచి తప్పించడం వరకు అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ రావడంతో గట్టి పోటీదారు గా నిలిచింది. దీంతో కెసిఆర్ కి గెలుపు అనుకున్నంత సునాయాసమేమీ కాదు అన్న అభిప్రాయం ఏర్పడింది.
ఈ ఉత్కంఠ మరింత పెరిగేలా చేసిన మరొక అంశం మాత్రం లగడపాటి సర్వే ఫలితాలే. ఎన్నికలయ్యాక వచ్చిన జాతీయ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టడంతో వార్ వన్ సైడే అని అనుకున్నారు తెరాస అభిమానులు. అయితే ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు లగడపాటి. జాతీయ సంస్థల నుంచి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన గంటసేపటి కల్లా ప్రెస్ మీట్ పెట్టిన లగడపాటి ప్రజా కూటమికి దాదాపు 65 సీట్లు వస్తాయని కేసీఆర్ కు సుమారు 35 సీట్లు వస్తాయని ప్రకటించి అందరినీ సస్పెన్స్ లో పడేశాడు. లగడపాటి సర్వే లకు గతంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉండడంతో జనాలకు జాతీయ సర్వేలు నమ్మాలో లగడపాటి సర్వే ని నమ్మాలో అర్థంకాని స్థితి ఏర్పడింది.
ఏది ఏమైనా ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండడంతో, దానికి మరి కొద్ది గంటలే సమయం ఉండడంతో ఇటువంటి ఫలితాలు వస్తాయో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో అన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది.