రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమౌతోంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్బీఐ గవర్నర్ విధుల నుంచి తప్పుకోవడం రాజకీయంగా భాజపాకి కచ్చితంగా తీవ్ర నష్టాన్ని కలిగించేదే. అయితే, పదవీ కాలం పూర్తి కాకుండా ఇలా గతంలో రాజీనామా చేసిన ఆర్బీఐ గవర్నర్ ఒక్కరంటే ఒక్కరే ఉండటం విశేషం. అది కూడా జవహర్ లాల్ నెహ్రూ హయాంలో జరిగింది. అంటే, ప్రస్తుత ఉర్జిత్ రాజీనామా… ఆర్బీఐ చరిత్రలోనే రెండోదన్నమాట.
1957లో రిజర్వ్ బ్యాంక్ కి సర్ బెనెగల్ రామారావ్ గవర్నర్ గా ఉండేవారు. జవహర్ లాల్ నెహ్రూ హాయాంలోని కేంద్ర ప్రభుత్వంతో భేదాభిప్రాయాలు వచ్చాయి. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి టి.టి. కృష్ణమాచారితో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో పదవీ కాలం మిగిలి ఉండగానే రామారావ్ రాజీనామా చేశారు. ఆ సందర్భంలో రామ్ కి నెహ్రూ రాసిన ఒక లేఖ నేపథ్యంలో రాజీనామా ఘటన చోటు చేసుకుంది. ఆ లేఖలో నెహ్రూ ఏమన్నారంటే… కేంద్ర ప్రభుత్వ పథకాలపై సెంట్రల్ బ్యాంక్ సూచనలు చెయ్యొచ్చనీ, అంతేగానీ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్యాంకు పాలసీలు ఉండకూడదన్నారు.
ఆ లేఖ అనంతరం రామారావ్ రాజీనామా చేశారు. నిజానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ గా అత్యధిక కాలం సేవలందించింది ఆయనే. జులై 1, 1949 నుంచి జనవరి 14, 1957 వరకూ ఆయన పదవిలో ఉన్నారు. అయితే, నెహ్రూ లేఖ తరువాత రెండో విడద పదవీ కాలం ముగియక ముందే, అంటే 1957, జనవరికి ముందే ఆయన రాజీనామా చేశారు. రామారావ్ తరువాత… పదవీ కాలం పూర్తికాకుండా రాజీనామా చేసిన రెండో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్. నాడు కూడా ప్రధాని లేఖ నేపథ్యంలో గవర్నర్ స్పందిస్తే, ఇప్పుడు కూడా మోడీ చర్యలూ నిర్ణయాల నేపథ్యంలో ఉర్జిత్ తప్పుకోవడం విశేషం.