తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. తిట్లు, దుషణలు, విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ … ఎన్నికలలో ఎంతో పోటాపోటీగా జరిగిందో.. ఆ స్థాయిని చాటి చెప్పేలా ఉన్నాయి. అంతిమంగా ఫలితం వెలువడనుంది. కొద్ది రోజులుగా గెలిచేదెవరు..? ఓడేదెవరు అంటూ.. విస్తృతంగా చర్చలు జరిపేస్తున్నారు. వాదోపవాదాలకు దిగుతున్నారు. మిత్రులతో.. అభిప్రాయ బేధాలు తెచ్చుకుంటున్నారు. చివరికి బెట్టింగులు కూడా కాస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రత్యేకంగా ఓడిపోయేవారు ఎవరూ ఉండరు. తమకు ఎవరు ఎక్కువగా సేవ చేస్తారని ప్రజలు నమ్ముకుంటారో వారినే గెలిపిస్తారు. కొన్ని ఓట్లు తక్కువ వచ్చి ఓడిపోయినంత మాత్రాన.. రెండో స్థానంలో ఉన్న వ్యక్తి పరాజితుడు కాదు. ఓ రకంగా చెప్పాలంటే.. అతనికికూడా బాధ్యతలు ఉంటాయి. అతను ప్రతిపక్షంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గెలిచిన అభ్యర్థి తప్పొప్పులను నిలదీయాల్సిన బాధ్యత.. రెండో స్థానంలో ఉన్న నేత మీద ఉంటుంది. అంటే.. ప్రజలు విజేతను మాత్రమే కాదు.. ఆ విజేతను.. సరైన దారిలో పెట్టాల్సిన వ్యక్తిని కూడా ఎన్నుకుంటారన్నమాట. కానీ అత్యధిక ఓట్లు సాధించడమే అంతిమ గెలుపు అన్నట్లుగా ఉంది పరిస్థితి.
ఈ రోజు కౌంటింగ్లో కాంగ్రెస్ గెలవొచ్చు… ప్రజా కూటమి గెలవొచ్చు. అంత మాత్రాన సీట్ల లెక్కలో వెనుకబడిన వారు.. పరాజితులుగా.. ప్రజల తిరస్కారానికి గురయినవాళ్లుగా భావించాల్సిన పని లేదు. గెలిచిన వారికి అంతిమంగా… 30 నుంచి 40 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి. అంటే.. అరవై శాతం మంది… ఇంకా చెప్పాలంటే..మెజార్టీ ప్రజలు వ్యతిరేకించినట్లే. మరి అలాంటి… వారు విజేతలు ఎలా అవుతారు. అందుకే భారత ప్రజాస్వామ్యంలో మెజార్టీదే..అసలైన అభిప్రాయం. ఆ మెజార్టీ ప్రజలు చెప్పిందే.. తీర్పు. అంటే.. గెలుపు ప్రజలదే. పార్టీలది కాదు.