తెలంగాణ ఎన్నికల సమయంలో `మహా కూటమి`పై ధీమాని కాస్త గట్టిగా వ్యక్తం చేసినవాళ్లలో బండ్ల గణేష్ ఒకరు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సీటు ఆశించి, భంగపడి, చివరికి ఆ పార్టీ తరపునుంచి అఫీషియల్ స్పీకర్గా.. మీడియాలో డిబేట్లకు హాజరయ్యాడు బండ్ల. తన మాటలు, సెటైర్లతో బాగా ఆకట్టుకున్నాడు. `కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. లేని పక్షంలో సెవన్ ఓ క్లాక్ బ్లేడుతో ఆత్మహత్య చేసుకుంటా` అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో.. బండ్ల గణేష్ పేరు బాగా ట్రోల్ అయ్యింది. బండ్లకు హైదరాబాద్లో ఎక్కడా 7 ఓ క్లాక్ బ్లేడ్ దొరక్కుండా చేయండంటూ… టీఆర్ ఎస్ అభిమానులు, మద్దతుదారులు… బండ్లని బాగా ట్రోల్ చేశారు. ఇప్పటి ఫలితాల పరిస్థితి చూస్తుంటే.. కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు బండ్లని మరింతగా టార్గెట్ చేయడంలో టీఆర్ఎస్ అభిమానులు మరింత పోటీ పడుతున్నారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యాక.. గణేష్ ఎక్కడా కనిపించలేదు. ఈ ఫలితాలు చూసిన తరవాత ఆయన మీడియా ముందుకు వచ్చే ధైర్యం కూడా చేయకపోవొచ్చు. ఎన్నికల సమయంలో నాయకులు సవాలక్ష వాగ్దానాలు చేస్తారు. ఒట్లు వేస్తారు. అవన్నీ నిలబెట్టుకోవాలన్న రూలు లేదు. కాకపోతే.. ఈ స్థాయిలో స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు మాత్రం కాస్త ఆలోచించుకోవాలి. లేకపోతే.. ఇలానే నవ్వుల పాలవ్వాల్సివస్తుంది.