హైదరాబాద్: ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్ సిటీల పథకం మొదటి దశ అమలుకు శ్రీకారం జరిగింది. మొదటి దశలో స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దే నగరాల తొలి జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఇవాళ విడుదల చేశారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం, కాకినాడ నగరాలు చోటు దక్కించుకున్నాయి. తెలంగాణలో ఒక్క నగరంకూడా ఎంపిక కాలేదు. వరంగల్ నగరం కొద్ది తేడాతో, ఒక్క పాయింట్‌తో అవకాశం కోల్పోయిందని మంత్రి చెప్పారు. విశాఖ 8, కాకినాడ 14 స్థానాల్లో నిలిచాయి.
జాబితాలో భువనేశ్వర్, పూణె, జైపూర్, సూరత్, కొచ్చి, అహ్మదాబాద్, జబల్పూర్, విశాఖపట్నం, షోలాపూర్, దావణగెరే, ఇండోర్, న్యూఢిల్లీ ఏరియా, కోయంబత్తూర్, కాకినాడ, బెల్గాం, ఉదయ్‌పూర్, గౌహతి, చెన్నై, లూథియానా, భోపాల్ నగరాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ వంటి కొన్ని ప్రధాన రాష్ట్రాలనుంచి ఒక్క నగరం కూడా ఎంపిక అవలేదు. ఈ జాబితా తయారీలో ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని మంత్రి చెప్పారు. 43 ప్రశ్నలతో ఒక ప్రశ్నాపత్రం రూపొందించి వివిధ నగరాల పాలనా యంత్రాంగాలను జవాబులు కోరామని, వాటి ఆధారంగా ఎంపిక జరిగిందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఎంపికైన స్మార్ట్ సిటీలకు ఒక్కొక్కదానికి రు.200 కోట్లను మొదటి సంవత్సరం, తర్వాత ప్రతి సంవత్సరం రు.100 కోట్లను కేంద్రం మంజూరు చేస్తుంది.