కెసిఆర్ సెప్టెంబర్ నెలలో ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలు ప్రకటించాక, గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఇతర పార్టీల కి ఎటువంటి ఫలితాలు ఎదురయ్యాయి అన్న విశ్లేషణ మీదకు వచ్చింది. గతంలో విజయంపై ధీమాతో మేరునగధీరులైన రాజకీయ నాయకులు సైతం ముందస్తు ఎన్నికలకు వెళ్లి భంగపడిన ఉదంతాలు ప్రజా కూటమికి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా తెరమీదకు తీసుకు వచ్చి, తొమ్మిది నెలల ముందే ముందస్తుకు వెళ్లిన కెసిఆర్ ఎటువంటి ఫలితాలను చవిచూడాల్సి వస్తుంది అని విశ్లేషిస్తూ మొత్తంగా టిఆర్ఎస్ పార్టీ భవితవ్యం పైనే ఉత్కంఠ నెలకొంది అంటూ కథనాలు వెలువరించింది. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లి కూడా గతంలో కంటే మరింత భారీ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన మేరునగధీరుడు గా కేసీఆర్ అవతరించాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై తొలిసారిగా 1983లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. 1982 లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మరి ఆయనకు పూర్తి సమయం ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతోనో, మరింకే కారణంతోనో కానీ, అప్పటి కాంగ్రెస్ పార్టీ 1983 ఆగస్టులో జరగవలసిన ఎన్నికలను అదే సంవత్సరం జనవరిలో నిర్వహించింది. అప్పటి సీఎం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ముందస్తు ఎన్నికల కారణంగా పార్టీని పూర్తి స్థాయిలో విస్తరించడానికి, జనం లోకి తీసుకెళ్లడానికి ఎన్టీఆర్ కు సమయం సరిపోదనుకుంటే , ప్రజలు మాత్రం ఏకంగా 202 స్థానాలతో తెలుగుదేశం పార్టీకి భారీ విజయాన్ని అందించారు. దీంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లి కోట్ల విజయభాస్కర రెడ్డి భంగపాటుకు గురయ్యారు.
తెలుగు రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ కూడా తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లి దెబ్బతిన్నారు. 1985లో జరిగిన ఎన్నికలలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న టిడిపి కి, 1990 మార్చి వరకు ప్రభుత్వానికి సమయం ఉన్నప్పటికీ అప్పటి రాజకీయ పరిణామాల దృష్ట్యా నాలుగు నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేశారు. 1989 లో జరిగిన రాజకీయ పరిణామాలు, కుల సమీకరణాలు వీటన్నింటి నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు ఎన్టీఆర్ వెళ్లారని కొంతమంది విశ్లేషిస్తూ ఉంటారు. అయితే అలా ముందస్తుకు వెళ్లినప్పటికీ కూడా ఎన్టీఆర్ కి సైతం భంగపాటు తప్పలేదు.
ఇక 2004లో రాజకీయ చాణక్యుడు అయిన చంద్రబాబు కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లి బోర్లా పడ్డారు. తనపై నక్సలైట్లు దాడి చేయడంతో, సానుభూతి వచ్చిందని ఆ సానుభూతిని రాజకీయంగా ఉపయోగించుకుందామని భావించిన చంద్రబాబు 2004 వరకు అసెంబ్లీ గడువు ఉన్నప్పటికీ 2003 నవంబర్ లోనే ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అయితే ఆయన అనుకున్నట్టుగా వెంటనే ఎన్నికలు జరగకపోవడం వల్ల బాబు వ్యూహం బెడిసికొట్టింది. వైయస్సార్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది.
ఇదే సమయంలో చంద్రబాబు సూచన మేరకు ఎన్డీఏ ప్రభుత్వం కూడా వాజ్పేయి నాయకత్వంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఇండియా ఈస్ షైనింగ్ నినాదంతో ప్రజల ముందుకు వెళ్లిన వాజ్పేయి ప్రభుత్వం ఎన్నికలలో చతికిలపడింది.
అయితే ముందస్తు ఎన్నికల లో భంగపాటుకు గురికాకుండా విజయాన్ని సాధించిన నేత ఇందిరాగాంధీ. 1969లో ఇందిరా గాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. దాంతో ఇందిరాగాంధీ ముందస్తు ఎన్నికలకు వెళుతూ ప్రయోగం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం ఇందిరాగాంధీ సాధించారు.
ఈ విశ్లేషణ అన్నింటినీ తెర మీదకు తీసుకుని వస్తూ, ఇందిరా గాంధీని పార్టీ నుంచి బహిష్కరించిన కారణంగా ఆవిడకు ప్రజల సానుభూతి ఉందని అందువల్ల ముందస్తు ఐనప్పటికీ ఆమె గెలిచిందని, సహేతుకమైన కారణం లేకుండా రాజకీయ ప్రయోజనాలను ఆశించి ముందస్తు ఎన్నికలకు వెళ్ళినట్లయితే కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్టీఆర్ చంద్రబాబు, వాజ్పేయి లాంటి మహా మహా నేతలే ఖంగుతిన్నారు వచ్చింది కాబట్టి వారి ముందు కేసీఆర్ అంత గొప్ప నాయకుడు ఏమీ కాదు కాబట్టి, ముందస్తుకు ప్రయత్నించడం కారణంగా కేసీఆర్ పరాభవాన్ని ఎదుర్కోక తప్పదు అని విశ్లేషించిన ఒక వర్గం మీడియా ఖంగుతినేలా మునుపటి ఎన్నికల కంటే కూడా భారీ విజయాన్ని సాధించిన కేసీఆర్ భారత దేశ రాజకీయ చరిత్రలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన నేతగా కొత్త అధ్యాయాన్ని సృష్టించారని చెప్పాలి
– Zuran (CriticZuran)