తెలంగాణ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో చేతగాక, పరిపాలించలేక తెలంగాణలో అడుగుపెట్టి.. కాంగ్రెస్ పార్టీని విధ్వంసం చేశారన్నారు. ఢిల్లీలో తాను ఏదో చక్రం తిప్పుతా అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారనీ, ఒక సంప్రదాయంగా ప్రతిపక్షాలన్నీ కలిసే సమావేశాన్ని కూడా తానే నిర్వహించినట్టుగా ఆయన చెప్పుకుంటున్నారని విజయసాయి అన్నారు. చంద్రబాబుని ఐరన్ లెగ్ అని అభివర్ణిస్తూ… ఆయన రాహుల్ గాంధీతో జతకట్టారనీ, తెలంగాణలో కాంగ్రెస్ కి ఏ గతి పట్టిందో… జాతీయ స్థాయిలో ఆ పార్టీకి అదే గతి పడుతుందని తనకు బాధగా ఉందంటూ ఎద్దేవా చేశారు.
గతంలో దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్, వాజ్ పేయి… వీరందరూ చంద్రబాబు నాయుడు మద్దతు తీసుకున్న తరువాత రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వచ్చిందంటూ విమర్శించారు విజయసాయి రెడ్డి. ఈ లెక్కన రాహుల్ గాంధీ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది వారే ఆలోచించుకోవాలన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారనీ, చంద్రబాబు పాలనలో జరిగిన అక్రమాలన్నీ రాబడితే రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకీ రూ. 20 లక్షలు చొప్పున ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఆయన, ఆయన అనుచరులు దోచుకున్న భూముల్ని వెనక్కి తీసుకుంటే… ప్రతీ పేద కుటుంబానికీ మూడు ఎకరాల చొప్పున ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు! వైకాపా అధ్యక్షుడు జగన్ అధికారంలోకి రాగానే పేద ప్రజలకు కోసం పని చేస్తారన్నారు విజయసాయి.
టీడీపీతో కలవడం కాంగ్రెస్ కి కలిసిరాని ఒక సెంటిమెంట్ గా చిత్రించే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి. అయితే, మరీ విడ్డూరం ఏంటంటే… చంద్రబాబుతో కలయిక తరువాతే పలువురు ప్రముఖులు రాజకీయ సన్యానం తీసుకున్నారని ఆరోపించడం! అంతేకాదు… అవినీతి సొమ్మును బయటకి తీసుకొస్తే… పేద కుటుంబాలకు లక్షల లెక్కన పంచొచ్చట! మూడేసి ఎకరాల భూమిని పేదలకు ఇవ్వొచ్చట..! అంతటి అవినీతి జరిగిందని తెలుస్తున్నప్పుడు… ఆ ఆధారాలేంటో బయటపడితే బాగుంటుంది. వేల ఎకరాల ఆ భూ బ్యాంకు ఎక్కడుందో చెప్పినా కూడా కొంత అర్థవంతంగా ఉంటుంది! రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ ఎన్నికల ఫలితాలను తెలుసుకోకుండా… కాంగ్రెస్ భవిష్యత్తు అంధకారం అదీఇదీ అంటూ విజయసాయి వ్యాఖ్యానిస్తుండటం చేస్తుండం విశేషం.