తెలంగాణ రాజకీయాల్లో… ఈ అసెంబ్లీ ఎన్నికలు పెను సంచలనం లాంటివి. హేమాహేమీలు అనదగ్గరవారంతా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ లో ఎక్కువ మంది ఉన్నా.. టీఆర్ఎస్ లోనూ.. కొద్ది మంది పరాజయం పాలయ్యారు. గులాబీ గాలి తెలంగాణ మొత్తం హోరెత్తినట్లు ఉన్నా… టీఆర్ఎస్ కు చెందిన నలుగురు మంత్రులు పరాజయం పాలవడం… అసక్తి రేకెత్తించేదే. టీఆర్ఎస్ లో నలుగురు మంత్రులు ఓడిపోయారు. వారంతా తమ తమ నియోజకవర్గాల్లో తిరుగులేని వారిగా పేరు తెచ్చుకున్న వారే. తాండూరులో వరుసగా గెలుస్తూ వస్తున్న పట్నం మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. విశేషం ఏమిటంటే.. ఈ పైలట్ రోహిత్ రెడ్డి.. టీఆర్ఎస్ నేత. తనకు సమాంతరంగా ఎదుగుతున్నారని మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయించారు.
ఇప్పుడు ఆయనే మహేందర్ రెడ్డిని ఓడించారు. ఇక ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఉపఎన్నికల్లో 40వేల కుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన తుమ్మల.. ఈ సారి.. అంత కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోలేకపోయారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో మంత్రిగా ఉన్న మరో నేత జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు. తన ఓటమికి టీఆర్ఎస్ నేతలే కృషి చేశారని ఆయన మధన పడుతున్నారు. ఇక ఓడిపోయిన మరో మంత్రి ములుగు నుంచి పోటీ చేసిన చందూలాల్. కుమారుల ఆగడాలతో ఆయనకు చెడ్డపేరు వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచిన సీతక్కకు మంచి పేరు ఉండటంతో ఆమె విజయం సులువయింది.
స్పీకర్ గా ఉన్న వారు.. మరోసారి గెలవరనే… అభిప్రాయం.. సంప్రదాయం తెలుగు రాజకీయాల్లో ఉంది. దీన్ని నిజం చేస్తూ… స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి… భూపాలపల్లిలో ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గెలిచారు. టీఆర్ఎస్ లో గెలుపు కష్టమనుకున్న ఎందరో.. భారీ మెజార్టీలతో విజయం సాధించారు. వారి విజయాల్ని చూసి.. ఓడిపోయిన వారు… విధిరాత అనుకోత తప్పని పరిస్థితి ఏర్పడింది.