తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని మహామహులంతా ఓటమి పాలయ్యారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి… గుడ్డిలో మెల్లగా బయటపడగా… సీఎల్పీ నేత జానారెడ్డి దగ్గర్నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వరకూ అందరూ పరాజయం పాలయ్యారు. కొడంగల్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆయన సోదరుడు… మంత్రి మహేందర్ రెడ్డి తాండూరులో ఓడిపోవడం కొసమెరుపు. కొడంగల్‌లో టీఆర్ఎస్ గెలుపు కోసం.. హరీష్ రావు , మహేందర్ రెడ్డి చేసిన మంత్రాంగం ఫలించింది. జానారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, సంపత్ కుమార్, కొండా సురేఖ ఓడిపోయిన వారి జాబితాలో ఉన్నారు. వీరందరూ.. తమ తమ నియోజకవర్గాల్లో బలంగా ఉన్న వారే. ప్రభుత్వాన్ని బలంగా ఢీకొన్న వారే. కానీ.. ఎవరికీ విజయం దక్కలేదు.
డీకే అరుణ పై ఆయన మేనల్లుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధించారు. గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి ఆయనకు కలసి వచ్చింది. కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయిన పొన్నం ప్రభాకర్ ఈ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ బరిలో నిలిచారు. అయితే కరీంనగర్ ప్రజలు ఆయనను ఆదరించలేదు. అలంపూర్ బరిలో నిలిచిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కూాడా టీఆర్ఎస్ అభ్యర్థి వి.ఎం. అబ్రహం చేతిలో ఓటమి పాలయ్యారు. అంతేకాకుండా టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదనే కారణంతో పార్టీ మారిన కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరి పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆమెకు కూడా నియోజకవర్గంలో ఎదురుగాలే వీచింది. టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ఆమెపై గెలుపొందారు. ఇక జీవన్‌రెడ్డిని గెలిపించడానికి తన సీటును కూడా త్యాగం చేసిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తన శక్తినంతా పెట్టి ప్రచారం చేసినప్పటికీ పరాభవం తప్పలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ భారీ మెజార్టీ సాధించారు.
కాంగ్రెస్‌లో ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు ఓటమి పాలయ్యారు. చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్ ఓడిపోయారు. ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్, పొన్నం ఓటమి పాలయ్యారు. ఆందోల్‌లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారిలో చాలా కొద్ది మంది మాత్రమే ప్రముఖ నేతలు ఉన్నారు. మంథనిలో శ్రీధర్ బాబు, హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే సీనియర్లుగా ఉన్నారు. అంటే.. అసెంబ్లీలో కూడా.. టీఆర్ఎస్ కు ఎదురు వచ్చే వారు ఎవరూ లేనట్లేనన్నమాట.