తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. ఇప్పుడు అధికారింగా టీఆర్ఎస్ గుర్తు మీద గెలిచారు. గత ఎన్నికల్లో.. పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలవగా.. టీడీపీలో ఒక్కరంటే.. ఒక్కరు మిగిలారు. ఆ ఒక్కరు.. సత్తుపల్లి నుంచి గెలిచిన సండ్ర వెంకట వీరయ్యారు. రేవంత్ రెడ్డి, ఆర్ . కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా… మిగిలిన వారంతా.. టీఆర్ఎస్ లో చేరారు. టీడీపీలోనే ఉన్న సండ్ర… సత్తుపల్లి నుంచి మరోసారి గెలిచి సత్తా చాటారు. కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి, కృష్ణయ్య పరాజయం పాలయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన వారంతా… విజయం సాధించారు.
అందరికీ టిక్కెట్లు ఇచ్చిన కేసీఆర్.. అందర్నీ గెలిపించుకున్నారు కూడా. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున రాజేందర్ రెడ్డి గెలిచారు. ఈ సారి కూడా ఆయన గెలిచారు. వరంగల్ జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ తరపున పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల నుంచి చల్లా ధర్మారెడ్డి గెలిచారు. వారిద్దరూ టీఆర్ఎస్ లో చేరారు. వారిద్దరూ ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్ తరపున గెలిచారు. ఇక గ్రేటర్ లో ముఖ్యంగా సీమాంధ్రుల ఓట్ల ప్రాబల్యం ఉందని భావిస్తున్న కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లిహిల్స్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, సనత్ నగర్ నియోజకవర్గాల నుంచి గెలిచిన మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, ప్రకాష్ గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు.. పార్టీ ఫిరాయిచినా.. మళ్లీ… టీఆర్ఎస్ టిక్కెట్ పై గెలిచి విజయం సాధించారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరికీ మంచి మెజార్టీలు వచ్చాయి. మొత్తానికి ఫిరాయింపు దారుల్లో టీఆర్ఎస్ లో చేరిన వారికి ప్రజామోదం లభించగా.. కాంగ్రెస్ లో చేరిన వారు మాత్రం తిరస్కరణకు గురయ్యారు. మొత్తానికి టీడీపీలో గెలిచి.. టీఆర్ఎస్ లో చేరిన వారందరూ.. ఇప్పటి వరకూ ఫిరాయింపు దార్లుగా.. విమర్శలు ఎదుర్కొనేవారు.ఇప్పుడా అవసరం లేకుండా పోయింది.