హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైనపుడు ఆ సభాముఖంగా తెలంగాణ తరపున కొంత మొత్తాన్ని విరాళంగా ఇద్దామనుకున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడియే రెండు పిడతల్లో మట్టి, నీళ్ళు ఇచ్చిన తర్వాత తాను భూరి విరాళం ప్రకటిస్తే, ప్రధాని నరేంద్రమోడి నొచ్చుకుంటారేమోనని ఊరుకున్నానని అన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు, ఏపీ క్యాబినెట్లోని తన మిత్రులైన యనమల రామకృష్ణుడు, ఇతర మిత్రులకు కూడా చెప్పానని తెలిపారు.
చంద్రబాబునాయుడుతో దోస్తానా ఎలా ఉందని అడగగా, రాజ్యాంగపరమైన స్నేహం కొనసాగుతోందని చెప్పారు. ఓటుకు నోటు కేసు ఏమయిందని అడగగా జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మాట్లాడతానని అన్నారు. వారసుడు కేటీఆరేనా అని అడగగా, తాను నిర్ణయిస్తే అవ్వడని, ప్రజలే నిర్ణయించాలని కేసీఆర్ చెప్పారు.
రోహిత్ వేముల విషయంలో మొదటిసారి స్పందించారు. ఆ విద్యార్థి చనిపోవటం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆంధ్రజ్యోతి దినపత్రికను ప్రశంశించారు. గ్రేటర్ మ్యానిఫెస్టోల అంచనాల విలువ రు.3 లక్షల కోట్లని, అవన్నీ అలవిగాని హామీలని ఆంధ్రజ్యోతి కథనంలో లేవనెత్తిన ప్రశ్నలు సమంజసమేనని అన్నారు.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై కేసీఆర్ సెటైర్లు విసిరారు. తెలంగాణకు ప్యాకేజిలు ఇస్తే లీకేజిలవుతాయని నాయుడు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలో తెలంగాణలో ఒక్క సిటీ కూడా లేదని, తెలంగాణను కాకి ఎత్తుకు పోయిందా అని ప్రశ్నించారు. వెంకయ్య నాయుడు ప్రాసలతో ప్యాకేజి, లీకేజి అని మాట్లాడితే సరిపోతుందా అంటూ తాను తెలుగు లిటరేచర్ చదివానని, వెంకయ్యకంటే ఎక్కువ ప్రాసలతో మాట్లాడగలనని కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలంగాణ రాష్ట్రం నొచ్చుకునేటట్లుగా ఉందని చెప్పారు.