తెలంగాణలో అధికార వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజలు తిరగబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ ఎలా విజయం సాధించింది. ఒక్కటే కారణం.. తెలంగాణవాదం. టీడీపీని నమ్ముకున్న పార్టీ నేతల కోసం.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని 13 సీట్లు తీసుకుని వాటిలో పార్టీ నేతలను గెలిపించుకునేందుకు ఆయన ప్రచారం చేయడమే తప్పయిపోయింది. దండయాత్ర చేస్తున్నారని ప్రచారం చేసి.. తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి… కులమతాలకు అతీతంగా.. అందర్నీ.. తెలంగాణ గొడుకు కిందకు.. అంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి గొడుకు కిందకు తీసుకు వచ్చారు. కేసీఆర్, టీఆర్ఎస్ ప్రచారం చేసింది.. పేరుకు.. చంద్రబాబే కానీ.. ఆంధ్ర పెత్తనం అనేది అసలు అర్థం. ఆంధ్రను బూచిగా చూపి… తెలంగాణ ప్రజల్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చారు. మరి ఆంధ్రులు ఏం చేశారు..? కులాల వారీగా విడిపోయి… బలహీనతను బయట పెట్టుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లోనూ ఎక్కడ లేని ఆసక్తిని రేకెత్తించాయి. దీనికి కారణం.. తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం మాత్రమే కాదు… పొరపాటున.. అక్కడ ప్రజాకూటమి అధికారంలోకి వస్తే.. ఏపీలో చంద్రబాబుకు ప్లస్ అవుతుందని.. అది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బందిగా మారుతుదని.. అక్కడి ప్రతిపక్షాలు భావించడమే. ఈ కారణంగానే… టీఆర్ఎస్ ను గెలిపించాలన్న పట్టుదలను… వైసీపీ, జనసేన చూపించాయి. బహిరంగంగా మద్దతు ప్రకటన చేయకపోయినా… ఆ పార్టీకి చెందిన వారు.. తెలంగాణలో తమ సానుభూతి పరులందరికీ సందేశాలు పంపారు. కూకట్ పల్లి లాంటి నియోజకవర్గాల్లో ఓ సారి వైసీపీ సానుభూతి పరులు, మరోసారి జనసేన సానుభూతిపరులు కేటీఆర్ తో సమావేశాలు ఏర్పాటు చేశారు కూడా. ఈ కారణాలతో ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు .. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ కూటమి ఓడిపోవాలని కోరుకున్నాయి. ఆయా సామాజికవర్గాల వారీగా.. కసరత్తు చేశాయి. ఈ పరాజయాన్ని టీడీపీకి అన్వయించేసి.. వైసీపీ ఏపీలో… రాజకీయ లాభం పొందడానికి ప్రయత్నాలు కూడా ప్రారంభించింది కూడా.
సెటిలర్లు కూడా తెలంగాణలో కులాల వారీగా చీలడం వెనుక జనసేన, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికలలో పోటీ చేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు పరోక్షంగా మద్దతిచ్చింది. ఈ నేపధ్యంలోనే తెలంగాణాలో టీఆర్ఎస్ గెలుపు వైసిపికి తీవ్ర ఆనందాన్ని కలిగించింది. అందుకనే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో తెలంగాణలో మహాకూటమి పరాజయం, టీఆర్ఎస్ విజయాన్ని బాణాసంచా పేల్చి స్వాగతించారు. చంద్రబాబు కూటమి ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు ఎదురుదెబ్బ తగిలిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. .తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత ఏపిలో తెలుగుదేశంపై అందరి దృష్టి పెరుగుతుంది. ఇప్పటికే రాజకీయ శత్రువులుగా ఉన్న బిజెపి, వైసిపి, జనసేనతో పాటు వీరిని ప్రోత్పహించే టీఆరెస్ కూడా పొరుగు రాష్ట్రంలో రెట్టించిన ఉత్సాహంతో తెలుగుదేశం పై పగ తీర్చుకునేందుకు పొంచి ఉంది. కేసీఆర్‌ను అంటే.. తెలంగాణను అన్నట్లుగా అక్కడి ప్రజలు భావించారు. కానీ..తెలంగాణ నేతలు చంద్రబాబును అంటే.. ఏపీని అన్నట్లు కాదు. ఎందుకంటే..అందరూ కులాల వారీగా విడిపోయారు..!