తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ భాగస్వామిగా ఉన్న ప్రజాకూటమి పరాజయం బాటలో ఉండగానే.. ఏపీలోని వైసీపీ కార్యాలయాల దగ్గర బాణసంచా కాల్చి పండగ చేసుకున్నారు. జనసేన అభిమానులు వారికి కార్యాలయాలు లేవు కాబట్టి.. అదే పనిని రోడ్ల మీద చేసుకున్నారు. చూసే వాళ్లకి చాలా విచిత్రంగా అనిపించింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడి పారిపోవడమే కాదు.. ధైర్యంగా కేసీఆర్ ఎదుర్కొన్న… టీడీపీ ఓడిపోతే… సంబరాలు చేసుకోవడం ఏమిటన్నది.. ప్రజలు సంభ్రమాశ్చర్యం. కానీ ఇవన్నీ పట్టిచుకునే స్థితిలో ఆయా పార్టీల నేతలు లేరు. వైసీపీ నేతల ఉత్సాహం అయితే పట్టరాని విధంగా ఉంది. ఒక వేళ తెలంగాణ ఎన్నికల్లో కూటమి గెలిచి ఉంటే… ఎలా స్పందించేవారేమో కానీ.. ఓడిపోయారు కాబట్టి.. అమితానందంతో.. అంతా చంద్రబాబు తప్పేనని చప్పుకోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉండటంతో విజసాయిరెడ్డి ఢిల్లీలో ఉన్నారు. రాజీనామా చేసిన ఎంపీలు కూడా అక్కడే ఉన్నారు. వారితో ఏం చేస్తున్నారో కానీ.. ఫలితాల ట్రెండ్స్ రాగానే మీడియా ముందుకు వచ్చి… చంద్రబాబుపై తిట్లతో హోరెత్తించారు. సాయంత్రానికి జగన్ కూడా తయారయ్యారు. ఆముదాలవలసలో ప్రజా సంకల్ప యాత్ర బహిరంగసభలో.. కాంగ్రెస్ ఓటమి చంద్రబాబు వల్లేనని తేల్చేసి.. తన ఆక్రోశం తీర్చుకున్నారు. తెలంగాణ ఫలితాలు అనైతిక పొత్తులపై ప్రజలిచ్చిన తీర్పుగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ , టిడిపి ఆడిన జిమ్మిక్కులను అక్కడ ప్రజలు తిప్పికొట్టారని విశ్లేషించుకున్నారు. మరోవైపు.. జనసేన శ్రేణులే కాదు.. పవన్ కల్యాణ్ కూడా.. టీఆర్ఎస్ విజయం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
జగన్, పవన్ పరస్పరం విబేధించుకుంటున్నా… కేసీఆర్, టీఆర్ఎస్ విషయంలో మాత్రం… ఒకే బాటలో ఉంటున్నారు. ఏపీ రాజకీయాల్లో మార్పు తేస్తానంటున్న కేసీఆర్.. వీరిని ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తారేమోనన్న ప్రచారం జరుగుతోంది. ఆ తరహా ప్రయత్నాలేవో ఉండబట్టే… ఇద్దరూ కలిసి యునానిమస్‌గా.. టీడీపీ పరాజయాన్ని మాత్రమే కాదు..టీఆర్ఎస్ విజయాన్ని .. ఆనందంగా స్వాగతిస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. వీరు ఇలా చేయడం వల్ల… ప్రజల్లో చులకన అవుతామనే విషయాన్ని మాత్రం ఊహించలేపోతున్నారు. ఎందుకంటే.. రాజకీయాల్లో పోరాడి ఓడిన వారికైనా గౌరవం ఉంటుంది కానీ.. పారిపోయినవాళ్లకు ఉండదు మరి..!