ఉత్కంఠత వీడింది. మళ్లీ గులాబీ సేనకే తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. తిరుగులేని మెజారిటీతో మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్నారు. ఈసారి కేసీఆర్ ఎలా పాలిస్తాడా? ఎన్ని ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తాడా? మరిన్ని వరాలు కురిపిస్తాడా? అంటూ ఆశగా ఎదురుచూస్తోంది తెలంగాణ సమాజం. అందులో సినీ పరిశ్రమ కూడా ఉంది. ప్రభుత్వం ఏదైనా, ఎవరిదైనా.. వాళ్లతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం చిత్రసీమకు అవసరం. `మా` గానీ ఫిల్మ్ ఛాంబర్ గానీ… ముఖ్యమంత్రిని, ఇతర మంత్రుల్నీ ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తుంటుంది. ఎందుకంటే… ప్రభుత్వంతో చేయించుకోవాల్సిన పనులు టాలీవుడ్‌కి చాలా ఉంటాయి.
ఉదాహరణకు `మా` ముందు రెండు లక్ష్యాలున్నాయి. మాకి ఎప్పటి నుంచో సొంత భవనం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని హంగులతోనూ ఓ భవనం నిర్మించాలంటే, అదీనూ ఫిల్మ్ ఛాంబర్ పరిసర ప్రాంతాల్లో అయితే కోట్లలో వ్యవహారం. నిర్మాణానికి అసరమైన సొమ్ము `మా` భరించినా.. స్థలం కావాలి. ఆ స్థలం ప్రభుత్వం కేటాయిస్తే బాగుంటుందన్నది `మా` ఆలోచన. కళా కారుల కోసం ఓ వృద్దాశ్రమం ఏర్పాటు చేయాలన్న ముమ్మర ప్రయత్నాల్లో ఉంది `మా`. అందుకోసం కూడా కేసీఆర్‌వైపే ఆశగా చూస్తోంది. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే.. ఓ ప్రెస్ మీట్ పెట్టి, అర్జెంటుగా అభినందించడానికి కూడా కారణాలు ఇవే.
ఫిల్మ్ ఛాంబర్ కీ ప్రభుత్వ అండదండలు చాలా అవసరం. టాలీవుడ్ లో పైరసీ ముమ్మరంగా జరుగుతోంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. దాన్ని అరికట్టడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వ యంత్రాగపు అండదండలు చాలా అవసరం. ప్రీమియర్ షోలకూ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. ఆంధ్ర లో అయితే… ఓ పెద్ద హీరో సినిమా వస్తోందంటే… అర్థరాత్రి నుంచి ఆటలు మొదలైపోతాయి. ఇది వరకు తెలంగాణలోనూ పర్మిషన్లు ఇచ్చేవారు. ఇప్పుడు అది కనిపించడం లేదు. ప్రీమియర్ షోల పట్లా.. తెలంగాణ ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించాలన్నది టాలీవుడ్ పెద్దల అభిప్రాయం. చిన్న సినిమాలకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం ఏమైనా వరాలు ఇస్తుందేమో అని నిర్మాతలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ హయాంలో కే సీ ఆర్.. మదిలో ఏముందో ఆయనకే తెలియాలి.