“మరి లగడపాటి ఎందుకలా చెప్పాడు? “ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే ప్రశ్న. ఎప్పుడూ ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించే లగడపాటి ఈసారి ఇంత ఘోరంగా విఫలం అవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. లగడపాటి కి ఉన్న ట్రాక్ రికార్డు బట్టి చూస్తే అతని సర్వే ( నిజంగా చేసి ఉంటే) ఇంత ఘోరంగా తేడా కొట్టే అవకాశం లేదు. మరి ఎక్కడ గురి తప్పింది. లగడపాటి ఎందుకు ఇటువంటి తప్పుడు ఫలితాలను ప్రకటించవలసి వచ్చింది.
లగడపాటి తప్పు ఫలితాలను ప్రకటించడానికి కారణాలు ఏమిటన్నది బహుశా ఆయనకు మాత్రమే తెలిసి ఉండాలి. అయితే ఆయన ఇటువంటి ఫలితాలను ప్రకటించడానికి ఏ కారణాలు ఉండవచ్చు అన్నది విశ్లేషిస్తే –
1. నిజంగానే లగడపాటి సర్వే గురి తప్పి ఉండవచ్చు
2. ప్రజా కూటమికి అనుకూలంగా ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు ఫలితాలను ఇచ్చి ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించవచ్చు
3. బెట్టింగ్ మాఫియా నో మరి ఇంకొకటో, లగడపాటిని తప్పుడు ఫలితాలు ప్రకటించడానికి ప్రేరేపించి ఉండవచ్చు
నిజంగానే లగడపాటి సర్వే గురి తప్పితే.. తెలంగాణ ఎమోషన్ ని పట్టుకోవడంలో లగడపాటి ఫెయిలైనట్టే
లగడపాటి సర్వే ప్రకటించిన రోజే, లగడపాటి మీద వచ్చిన మొదటి విమర్శ ఏమిటంటే- తెలంగాణ ప్రజల ఎమోషన్ ని పట్టుకోవడంలో లగడపాటి అన్నిసార్లు కూడా విఫలమయ్యాడు అన్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో, ప్రజల్లో తెలంగాణ ఉద్యమం నిజంగా లేదు అని, ఇది కేవలం నాయకులు సృష్టించిందేనని ఆయన వాదిస్తూ వచ్చాడు. ఆ తరువాత ప్రజల్లో ఉద్యమ తీవ్రత ఎంత ఉందో అర్థమైన తర్వాత కూడా, తెలంగాణ ఏర్పడే అవకాశం లేదు అని చెబుతూ ఆంధ్ర ప్రజలను మభ్యపెడుతూ వచ్చాడు. ఒక లగడపాటి అనే కాదు కానీ చాలా మంది ఆంధ్ర నేతలు ఇదే విధమైన మాటలు చెబుతూ, ఆంధ్ర ప్రజలు తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాడకుండా సమైక్యాంధ్ర కోసం పోరాడేలా ప్రజలను నడిపించారు. అయితే తెలంగాణ ఎమోషన్ ని, తెలంగాణ ప్రజల నాడిని పట్టుకోవడంలో లగడపాటి వీక్నెస్ కారణంగానే లగడపాటి ఇంత ఘోరంగా విఫలమయ్యాడు అన్నది ఒక వాదన. లగడపాటి సర్వే ప్రకటించిన రోజు నుంచి టీఆర్ఎస్ నేతలతో పాటు టీవీ డిబేట్ లో పాల్గొన్న పలువురు విశ్లేషకులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
బెట్టింగ్ మాఫియా నో మరొకటో లగడపాటిని ఇటువంటి ఫలితాలు ప్రకటించమని ఒత్తిడి చేశాయా?
ఈ వాదన కూడా టీవీ డిబేట్ లలో కొంత మంది విశ్లేషకులు నిన్న ఫలితాల అనంతరం వ్యాఖ్యానించినదే. ఇప్పుడిప్పుడే లగడపాటి కారణంగా, ఆయన మీద నమ్మకంతో ప్రజా కూటమి మీద పందేలు కాసి జనాలు భారీగా నష్టపోయారు అని రిపోర్టులు వస్తున్నాయి. ఇలా నష్టపోయిన వారి నుంచి వస్తున్న వ్యాఖ్యలే బహుశా ఈ బెట్టింగ్ మాఫియా లాంటిది ఏదో లగడపాటిని ఇలాంటి ఫలితాలు ప్రకటించడానికి ప్రోత్సహించింది అన్నది.
బాబు ప్రోద్బలంతోనే లగడపాటి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారా?
అయితే వీటన్నింటికంటే ప్రముఖంగా వినిపిస్తున్న వాదన ఏమిటంటే ఉద్దేశ్యపూర్వకంగానే లగడపాటి చంద్రబాబును మెప్పించేలా గా సర్వే రిపోర్ట్ ఇచ్చాడు అన్నది. నిజానికి సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దు చేసే సమయానికి టిఆర్ఎస్ పట్ల ప్రజల్లో హవా స్పష్టంగా కనిపించింది. మీడియా కూడా కెసిఆర్ పట్ల పాజిటివ్ కథనాలను వెలువరిస్తూనే ఉంది . అయితే ఎప్పుడైతే చంద్రబాబు రంగంలోకి దిగాడొ, అప్పుడే మీడియా వ్యవహార శైలి మారిపోయింది. స్వతహాగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా మొత్తం ప్రజా కూటమికి మద్దతుగా కథనాలను విస్తృతంగా ప్రసారం చేసింది. అయితే అప్పటికి కూడా ప్రజా కూటమి గెలుస్తుందన్న నమ్మకం ఎవరికీ పెద్దగా రాలేదు. ప్రజా కూటమి పట్ల వేవ్ క్రియేట్ చేయడానికి, చంద్రబాబు లగడపాటిని రంగంలోకి దింపారు అన్నది ఒక వాదన. ఆ వాదన ప్రకారం నేరుగా ప్రజా కూటమి గెలుస్తుందని మొదట్లో చెప్పకుండా, పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లు గెలుస్తారని లగడపాటి ప్రకటించాడు. దీంతో టిఆర్ఎస్ శ్రేణులలో ఒక అయోమయ పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రజా కూటమి పట్ల సానుకూలమైన రిపోర్టులు లగడపాటి ఇచ్చారు. ఇదంతా కేవలం ఎన్నికల ముందు – ‘గెలిచే పార్టీకే ఓటు వేయాలనే’ ఓటరు మనస్తత్వాన్ని ప్రజా కూటమికి అనుకూలంగా ప్రభావితం చేయడానికే అన్నది విశ్లేషకుల వాదన. కాబట్టి అటువైపు మీడియాలో హైప్ క్రియేట్ చేయడం తో పాటు, ఇటువైపు లగడపాటి సర్వే లు అని చెబుతూ ప్రజా కూటమికి వేవ్ క్రియేట్ చేయడానికి లగడపాటి సహకారంతో చంద్రబాబు ప్రయత్నించారు అని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా చూస్తే ఓటర్లను ప్రజా కూటమికి ఓటు వేసేలా ప్రభావితం చేయడానికి లగడపాటి తో చంద్రబాబు మరియు ప్రజా కూటమి పెద్దలు ఈ రకమైన రిపోర్టులు ఇప్పించారు అన్నది ఈ వాదన.
బాబు బ్రహ్మాస్త్రాన్ని ముందే వాడేశాడా?
ఒకవేళ చంద్రబాబు ప్రోద్బలంతోనే లగడపాటి ఇలా చేశాడన్న వాదన నిజమే గనుక అయితే, అభిమానులు చాణిక్యుడు గా పిలుచుకునే చంద్రబాబు బ్రహ్మాస్త్రాన్ని ముందే వాడేసినట్టు ఒప్పుకోవలసి వస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఏకపక్షంగా టిఆర్ఎస్ హవా కనిపించినప్పటికీ ఫలితాల రోజు అంత ఉత్కంఠ కనిపించింది అంటే అది కేవలం లగడపాటి సర్వే కారణంగానే. అయితే ఏకపక్ష వాతావరణం కనిపించిన తెలంగాణలో, అందులోనూ తమకు ఎటువంటి ‘పొలిటికల్ స్టేక్స్’ లేనటువంటి తెలంగాణలో కాకుండా రేపు ఆంధ్ర ప్రదేశ్ లో మూడు ముక్కలాట గా జరగనున్న ఎన్నికల్లో ఈ అస్త్రాన్ని వాడి ఉంటే కనీసం కొంత వరకు ప్రభావాన్ని చూపి ఉండేదేమో. అయితే ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని వాడేసేయడం వల్ల మళ్లీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి లగడపాటి సర్వే లు అంటూ ప్రజలను ప్రభావితం చేసే అవకాశం బాబుకు పూర్తిగా లేకుండా పోయింది. బాబు ప్రోద్బలంతోనే లగడపాటి రిపోర్టు గనక ఇచ్చి ఉంటే, బాబు తన బ్రహ్మాస్త్రాన్ని వృధా చేసుకున్నట్టే.
– జురాన్ ( CriticZuran )