చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేసినందున.. తాను ఏపీలో అడుగు పెడతానని..చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని.. కేసీఆర్ ఎన్నికలలో గెలిచిన ఉత్సాహంలో ప్రకటించారు. ఈ రిటర్న్ గిఫ్ట్ అంశం.. రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అంటే.. ఏం చేస్తారా అన్న చర్చలు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. విశేషం ఏమిటంటే.. కచ్చితంగా ఇవ్వాల్సిందేనని.. సింరెండు రాష్ట్రాల నేతలు అంటున్నారు. విచిత్రంగా… టీఆర్ఎస్ నేతలు… తెలంగాణలో రిటర్న్ గిఫ్ట్ గట్టిగానే ఉంటుందని కాస్త హెచ్చరిక స్వరంతో చెబుతున్నారు కానీ… ఏపీలో వైసీపీ, జనసేన నేతలు మాత్రం.. స్పందించడం లేదు. విచిత్రంగా టీడీపీ నేతలు మాత్రం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నామన్నట్లుగా ప్రకటిస్తున్నారు. చంద్రబాబు కూడా.. టీడీపీ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో దీనిపై స్పందించారు.
ప్రజాస్వామ్యం లో కేసీఆర్ కు ఎక్కడైనా పోటీ చేసే.. ప్రచారం చేసుకునే అవకాశం ఉందన్నారు. బెదిరింపులకు భయపడేది లేదని .. ఏమైనా చేసుకోవచ్చన్నారు. మరో వైపు ఢిల్లీలో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అంశంపై స్పందించిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. కేసీఆర్ ఎలాంటి గిఫ్ట్ ఇచ్చినా తమకే లాభం కలుగుతుందని విశ్లేషించారు. కేసీఆర్ ఏపీలో ప్రచారం చేస్తే మాకే లాభమన్నారు. మరో మాజీ ఎంపీ సబ్బం హరి కూడా.. దీనిపై స్పందించారు. చంద్రబాబు గిఫ్ట్ ఇస్తేనే కేసీఆర్ సీఎం అయ్యారని… కేసీఆర్ గిఫ్ట్ ఇస్తే చంద్రబాబు సీఎం అవుతారని సబ్బంహరి జోస్యం చెప్పారు. ఏపీలో పవన్, జగన్ కలిస్తే చంద్రబాబుకు కష్టమే నని కానీ వైసీపీ, జనసేన మధ్య దూరం పెరుగుతోందని వ్యాఖ్యానించారు.
వైసీపీ, జనసేనలను కలిపి .. కేసీఆర్ .. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడన్న విశ్లేషణలు రాజకీయవర్గాల్లో జరుగుతున్నాయి. అయితే.. కేసీఆర్ తాను స్వయంగా ఏపీకి వెళ్తానని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే.. ఏపీలో వెలమ సంఘాల పేరుతో.. ఆయా సామాజికవర్గాల జనాభా ఉన్న చోట ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. అలాంటి వారందరూ తనను పిలుస్తున్నారని కేసీఆర్ భావిస్తున్నారు. ఏపీలో కేసీఆర్ ఎంట్రీ ఇస్తే.. తమ పరిస్థితి ఏమిటని.. వైసీపీ, జనసేన నేతలు మథన పడుతున్నారు.