తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎట్టకేలకు గ్రేటర్ ప్రచార బరిలోకి దిగారు. గత ఏడాదిన్నర కాలంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరవు పెట్టుకుంటూ, రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయాలన్నా కూడా అది ఒక్క తెరాసకు మాత్రమే సాధ్యమవుతుంది తప్ప.. మరొకరికి ఆ చిత్తశుద్ధి లేదనే వాదనతోనే కేసీఆర్ ప్రచారంలో దూసుకువెళ్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే తొలిరోజు ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన పరిపాలన గురించి, వ్యవహార సరళి గురించి చాలా కాలంగా చాలా మందిలో ఉన్న చాలా చాలా సందేహాల గురించి క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవాలి.
ప్రధానంగా ఎంఐఎంతో మైత్రి గురించి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ఎంఐఎం మాకు మిత్రపక్షమే అని ఆయన సెలవిచ్చారు. ఆపార్టీ మీద ఉండే మతతత్వ ముద్రను కూడా ఆయన ఖాతరు చేసే స్థితిలో లేరు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నాటినుంచి వారు మాకు మిత్రపక్షమే.. ఆ పార్టీనేతలు అసెంబ్లీలోనే ఆ విషయం చెప్పారుఅంటూ కొట్టి పారేశారు.
చంద్రబాబుకు హైదరాబాదులో ఏం పని అంటూ నిలదీసిన కేసీఆర్.. ఆయన మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడడానికి ఏమాత్రం వెనుకాడకపోవడం విశేషం. చంద్రబాబు తన పాలనలో తెలంగాణకు ఏమీ చేయలేదంటున్న కేసీఆర్.. ఆయనతో రాజ్యాంగపరమైన స్నేహం మాత్రం కొనసాగుతుందని సన్నాయినొక్కులు నొక్కడం విశేషం.
అయితే గెలుపు విషయంలో కేసీఆర్ కొద్దిగా ప్రాక్టికల్‌గా మాట్లాడుతున్నారు. కొడుకు కేటీఆర్ వంద సీట్లు గెలుస్తాం అంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉండగా.. తెరాస సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుంది.. అని మాత్రమే కేసీఆర్ క్లారిటీ ఇస్తున్నారు. ఎంఐఎం మైత్రి గురించి ఆయన మాటలు వింటే- వారి మద్దతు తీసుకుని, లేదా, వారితో అధికారాన్ని పంచుకుంటూ.. మేయర్ పీఠాన్ని తెరాస చేజిక్కించుకునే ఉద్దేశంతో ఉన్నట్లు తెలిసిపోతుంది.
అలాగే సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ మరణం విషయంలో కూడా కేసీఆర్ స్పందించలేదంటూ.. కాంగ్రెస్ తదితర పార్టీలు నానా గొడవ చేసినసంగతి తెలిసిందే. ప్రభుత్వం పరంగా చేయాల్సింది మొత్తం చేశామంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. సుదీర్ఘ కాలంగా తన గురించి ఉన్న దుష్ప్రచారాలపై , ప్రజల్లో ఉన్న సందేహాలపై క్లారిటీ ఇచ్చినట్లుగా కేసీఆర్ ప్రెస్‌మీట్ సాగిపోవడం విశేషం.