తెలంగాణకి ఉన్న అప్పుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, ప్రతీ పైసా మీదా తమకు అవగాహన ఉందన్నారు కేసీఆర్. హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో, కేంద్రం సహకారం ఉన్నా లేకుండా.. వచ్చే వచ్చీ పోయేది మొత్తం రూ. 10 లక్షల కోట్లన్నారు. దీన్లో రూ. 2.40 లక్షల కోట్ల అప్పులు తీర్చాలనీ, దాన్లోంచి కొంత ఎలిజిబిలిటీ తిరిగి వస్తుందన్నారు. నీళ్లు, నిధుల విషయంలో విజయం సాధించారనీ, కానీ నియామాకాల దగ్గరకి వచ్చేసరికి కొంత ఇబ్బంది ఉంది కదా అని కేసీఆర్ ప్రశ్నిస్తే… కాంగ్రెస్, టీడీపీ పాలన గురించి చెప్పారు! గత ప్రభుత్వాలు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాయని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ఎక్కువమంది ఉండరనీ, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఒక్క శాతమే అన్నారు.
ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ… అక్కడున్న ముఖ్యమంత్రే హోదాతో వచ్చేదీచచ్చేదీ ఏం లేదన్నారని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు ఇచ్చేదాకా ఒప్పుకునే లేదని ఆయనే అంటున్నారనీ, ఆయనకే స్పష్టత లేనప్పుడు దాని గురించి తానేం మాట్లాడతా అన్నారు. ఇక, నోట్ల రద్దు అంశమై స్పందిస్తూ… అది చెడ్డ కార్యక్రమం కాదన్నారు! దాని ఉద్దేశం మంచిందనీ, కానీ మధ్యలోనే ప్రధాని మోడీ ఆపేశారని వ్యాఖ్యానించారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండవనీ, ఎలా చూసుకున్నా మంచిదే అన్నారు. ప్రతీ ఇంటికీ కుళాయి ఇవ్వనిదే ఓట్లు అడగనని తాను గతంలో చెప్పాననీ… వాస్తవానికి గత ప్రభుత్వ కాలపరిమితి కొన్ని నెలలు ఉందనీ, ఆ లెక్క ప్రకారమే ఏప్రిల్ నాటికి ఆ హామీ అమలు జరుగుతుందన్నారు. ఇక, ఇతర అంశాల విషయానికొస్తే… జాతీయ రాజకీయాల గురించి ఇవాళ్ల కూడా మరోసారి మాట్లాడారు. తన అజెండా త్వరలో ప్రకటిస్తా అన్నారు. మజ్లిస్ పార్టీ తమకు మద్దతు ఇస్తుందిగానీ, క్యాబినెట్ లో ఉండదని స్పష్టం చేశారు. గత క్యాబినెట్ తో పోల్చుకుంటే, ఈసారి సంఖ్య కొంత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
నోట్ల రద్దు నిర్ణయంతో అందరూ నష్టపోయారంటూ ఎన్నికల సమయంలో విమర్శలు చేస్తూ ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడు అది మంచి కార్యక్రమమే, కానీ సక్రమంగా అమలు కాలేదని కేసీఆర్ మాట మార్చారు. రాష్ట్రంలో నియామకాల గురించి కూడా ఇప్పుడు కొత్త లెక్కలు చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా… ఏపీకి ఏ తరహా ప్రయోజనాలు కేంద్రం కల్పిస్తే, అవే తమకూ వర్తింపజేయాలంటూ ఆ మధ్య డిమాండ్ చేశారు. ఇప్పుడేమో, హోదాపై చంద్రబాబు నాయుడుకే స్పష్టత లేదంటున్నారు..! డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి చేశామని తాము చెప్పలేదనీ, ఇంటింటికీ నల్లా ఇవ్వడం పూర్తయిందనీ తాను చెప్పలేదని అంటూనే… వందకు వంద శాతం ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో తమది మాత్రమే అని చెప్పుకున్నారు.