ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని తెరాస అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాననీ, అక్కడికి రమ్మంటూ తనను పిలుస్తున్నారంటూ ఇవాళ్ల కూడా మరోసారి ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై స్పందించారు. ఒంగోలులో జరిగిన జ్ఙానభేరి సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. చివరిగా కేసీఆర్ వ్యాఖ్యల్ని ప్రస్థావించారు!
‘నిన్నామొన్నా తెలంగాణ ఎన్నికలు జరిగాయి. అక్కడి ముఖ్యమంత్రి అంటున్నాడు… ఇక్కడికి వచ్చి నాకేదో గిఫ్ట్ ఇస్తానని. డెమొక్రసీలో ఎవరు ఎక్కడికి వచ్చైనా పనిచేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజలను మెప్పించుకోవడం కోసం ఎక్కడికైనా రావచ్చు’ అన్నారు చంద్రబాబు నాయుడు. తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు పెట్టారన్నారు. కొంతమంది అటూఇటూ లాలూచీలు పడొచ్చుగానీ, తెలుగువాళ్లు ఎక్కడున్నా తాము పనిచేశామన్నారు. కొత్త ఆంధ్రప్రదేశ్ లో కష్టపడి పనిచేయాలంటూ తనకు ప్రజలు తీర్పు ఇచ్చారు అన్నారు. కొంతమంది విమర్శించినా బెదిరించినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఒకేలా పనిచేస్తుందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకోసం అంకిత భావంతో పనిచేస్తుందనీ, ఎక్కడా డీవీయేషన్ ఉండదన్నారు. తాను ఏ పని చేసినా ప్రజల కోసమేననీ, ప్రజల మద్దతు తనకు కావాలనీ, ప్రజల పూర్తి సహకారం ఉంటే అనుకున్నది సాధిస్తామనీ, ఆ సహకారం చేస్తారని కోరుకుంటున్నా అన్నారు.
కేసీఆర్ వస్తారంటున్నారు కదా… ఎవరైనా ఎక్కడైనా పనిచేసుకోవచ్చని స్పష్టంగానే చంద్రబాబు చెప్పారు. తెలుగు జాతి కోసం ఎన్టీఆర్ పెట్టిన పార్టీ టీడీపీ అని గుర్తు చేయడం, అటూఇటూ తేడా లేకుండా తాము పనిచేశామని చెప్పడం ద్వారా… తెరాస గురించి అన్యాపదేశంగా చెప్పాల్సిందేదో చెప్పే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు! వాస్తవానికి, ప్రజాస్వామ్య దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు. ఎన్ని రాష్ట్రాలకైనా వెళ్లొచ్చు. అయితే, ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు ఉన్న ఉనికి ఏపాటిది అనేదే అసలైన ప్రశ్న అవుతుంది కదా!