తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్.. చంద్రబాబుపై భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు కృతజ్ఞతలంటూనే.. మేం రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. ఇలా వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం.. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం.. చంద్రబాబు హైదరాబాద్, ఖమ్మంలలో ప్రచారం చేయడం.
తెలంగాణలో కాంగ్రెస్ కూటమి ఓడిపోతే వైసీపీ, జనసేన సంబరాలు ఎందుకు..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. దీనికి కారణం.. నిన్నామొన్నటి దాకా ఉమ్మడి రాష్ట్రంగా ఉండటమే కాదు.. రెండు.. చంద్రబాబు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడం. చంద్రబాబునాయుడు .. తెలంగాణ రాజకీయాల్లో చేసే ప్రయోగం… ఏపీలో ఎలాంటి పోలైజేషన్ తెస్తుందనే ఆసక్తి ఏర్పడింది. తెలంగాణ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబును వ్యతిరేకించేవారంతా.. తెలంగాణలో టీఆర్ఎస్ గెలవాలని కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి , పవన్ కల్యాణ్ పార్టీల నేతలు బహిరంగంగానే పని చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. పలు చోట్ల.. వైసీపీ, జనసేన నేతలు.. కేసీఆర్, కేటీఆర్‌లకు పాలాభిషేకాలు చేశారు. తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కూటమి తెలంగాణలో గెలచినపట్లయితే… ఏపీలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అడ్వాంటేజ్ అయ్యేది. ఓడిపోయారు కాబట్టి… ఆయా పార్టీల నేతలకు ఆ ఉత్సాహం వచ్చింది.
ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ వేలు పెడితే అది గిఫ్టా..?
కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు. ఈ గిఫ్ట్ ఏమిటన్నదానిపై రెండు అవకాశాలు ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు తన వంతు పాత్ర పోషించాలని ఆరాట పడుతున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి అంటూ… ప్రయత్నాలు చేయబోతున్నారు. తన కూటమి ద్వారా చంద్రబాబు ప్రయత్నాలకు గండి కొట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. దీనిలో నేరుగా ఉన్న అర్థం ఏమిటంటే… ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మీ అంతు చూస్తాం… అన్నది ఆ పద్దతి. కేటీఆర్ కూడా.. ఎన్నికల ప్రచారంలో.. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని ప్రకటించారు. అయితే.. కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో ఏమైనా చేయగలరా..? తెలుగు ప్రజలందరి కోసం పుట్టిన పార్టీ అన్న తెలుగుదేశానికే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో బేస్ లేకుండా పోయింది. నాయకుల పట్ల ప్రజల్లో గౌరవం ఉండవచ్చు. చంద్రబాబు పట్ల తెలంగాణ ప్రజల్లో గౌరవం ఉండవచ్చు.
రిటర్న్ గిఫ్ట్ పేరుతో హడావుడి చేస్తే చంద్రబాబుకే లాభమా..?
ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. 2009లో తెలంగాణ బద్ధ వ్యతిరేకి అయిన రాజశేఖర్ రెడ్డికి 50 సీట్లు వచ్చాయి. టీఆర్ఎస్కి పది సీట్లు వచ్చాయి. అంటే.. అర్థం ఏమిటి.. సమైక్య రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం ప్రత్యేక రాష్ట్రంలో లేదు. అలాంటి పరిస్థితుల్లో టీడీపీకే.. తెలంగాణలో బేస్ లేనప్పుడు.. తెలంగాణ రాష్ట్ర సమితి.. ఏపీ రాజకీయాల్లోకి వెళ్లి ఏమైనా చేస్తుందా..?. ఏపీకి వెళ్లి తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పోటీ చేసే అవకాశం లేదు. ఒక వేళ పోటీ చేస్తే.. చంద్రబాబునాయుడుకి అనుకూలంగా మారుతుంది. సెంటిమెంట్‌తో అన్ని రకాల ఓట్లు పోలరైజ్ అవుతాయి. యాంటీ గవర్నమెంట్ ఓట్లు చీలుతాయి. అది అంతిమంగా చంద్రబాబుకే ప్రయోజనం అవుతుంది. అది రిటర్న్ గిఫ్ట్ కాదు… చంద్రబాబుకు ఉపయోగపడేది. చంద్రబాబు సంగతి చెబుతానన్నట్లుగా రిటర్న్ గిఫ్ట్ పదం వాడారు కానీ.. నిజంగా ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ జోక్యం చేసుకుంటే… చంద్రబాబుకు లాభం చేసినట్లే.
వైసీపీ, జనసేనలకు మద్దతు ప్రకటిస్తారా..?
అయితే… ఏపీలో చంద్రబాబునాయుడ్ని ఓడించాలనుకుంటున్న వైసీపీ, జనసేనలకు మద్దతుగా కేసీఆర్… ప్రచారం చేస్తారేమో చూడాలి. తెలంగాణ ఎన్నికల్లో.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న వారంతా.. టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చారు. ఆతర్వాత చంద్రబాబుపై ఆయన చేసిన కామెంట్లు వాళ్లందరికీ సంతృప్తినిచ్చాయి. వారికి మరింత ఉత్సాహం ఇచ్చేందుకు కేసీఆర్.. వారికి మద్దతుగా ప్రచారం చేస్తారా అన్నది ఆసక్తికరం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గొప్ప రాజకీయ కమ్యూనికేటర్లలో కేసీఆర్ ఒకరు. ఆయన తన ప్రసంగాలలతో ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తారు. కానీ ఆసక్తి వేరు.. ఓటింగ్ వేరు. కేసీఆర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఏపీ ప్రజలు… ఎలా ఆలోచిస్తారనేది అధ్యయనం చేయాల్సి ఉంది. ఇవన్నీ కాకుండా.. ఎవరికీ మద్దతు ఇవ్వకుండా.. కేవలం చంద్రబాబును ఓడించమని.. పిలుపునిచ్చి ఊరుకుంటారా.. అనేది చూడాలి.