వంద శాతం మేనిఫెస్టో అమలు చేసిన ప్రభుత్వం తమదని.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… ఉదరగొట్టి మీడియాకు చెబుతారు. మరో మాట అడగడానికి అవకాశం ఉండదు. కేజీ టు పీజీ విద్య దగ్గర్నుంచి దళితులకు మూడెకరాల భూమి వరకూ.. ఏ ఒక్కటీ చేయలేదు. ఇది ప్రజలందరికీ తెలుసు. పార్టీలకూ తెలుసు. కానీ అవన్నీ సాధ్యం కాదనుకున్నారేమో కానీ.. రైతు బంధు లాంటి పథకాలు ప్రారంభించి… ఇళ్ల వద్దకు కళ్ల డాక్టర్లను పంపించి… పరీక్షలు చేయించి… అదే గొప్ప ప్రభుత్వం అనిపించుకునేలా చేశారు. ఫలితంగా మళ్లీ అధికారంలోకి వచ్చారు. మళ్లీ అధికారంలోకి రావడానికి కేసీఆర్ కూడా కాంగ్రెస్తో పోటీ పడి చాలా హామీలు ఇచ్చారు. వాటిలో పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ఏక కాలంలో రూ. లక్ష రైతు రుణమాఫీ ఉన్నాయి.
గెచిలిన తర్వాత ఓ సారి… టీఆర్ఎస్ఎల్పీ నేతగా మరోసారి మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. తనను గెలిపించిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని.. చెప్పడానికి ఐదు నిమిషాలపాటు కూడా సమయం కేటాయించలేదు. జాతీయ రాజకీయాలపై అనర్గళంగా మాట్లాడి … రాజకీయ ప్రత్యర్థులపై ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయిన ఆయన… ఉద్యోగ నియామాకాలు, రూ. లక్ష రుణమాఫీ, పెన్షన్ల పెంపు వంటి వాటిపై.. ప్రజలకు భరోసా ఇచ్చే ప్రకటన చేయలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగ భృతి అని ప్రకటించారు. కానీ… ఆ సమయానికి సార్వత్రిక ఎన్నికలు వస్తాయి. కోడ్ పేరుతో ఆపేస్తారు. పార్లమెంట్ సీట్ల కోసం వేట ప్రారంభిస్తారు. పెన్షన్లు, ఉద్యోగ నియామకలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా అంతే. పోనీ.. రూ. లక్ష రుణమాఫీ చేస్తారా..? అంటే… దాని గురించి కేసీఆర్ నోరు ఎత్తడం లేదు.
కాంగ్రెస్ పార్టీ రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు.. నిరుద్యోగ భృతి సహా వివిధ హామీలు ఇచ్చినప్పుడు.. దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ మొత్తం కావాలని సెటైర్ వేశారు. తర్వాత తను కూడా…అలాంటి హామీలే ఇచ్చారు. దాని కో లెక్కలు కూడా చెప్పారు. మరి అమలు చేస్తారా..? లేక గత ఎన్నికల్లో మేనిఫెస్టోని అమలు చేసినట్లు.. వంద శాతం మాటల్లో అమలు చేస్తారా..? అన్నది ఆసక్తికరం. ప్రజలు ప్రతీసారి మోసపోరేమో..? తిరగబడే ప్రమాదం కూడా ఉంటుంది..!