తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండో సారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్ లో నిరాడంబరంగా నిర్వహించిన కార్యక్రమంలో ” కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను..” అంటూ ప్రమాణం చేశారు. గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ముహుర్తం ప్రకారం మ.1.25 గంటలకు కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. కేసీఆర్ తో పాటు కేబినెట్ సభ్యుడిగా మహమూద్ అలీ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు తరలి వచ్చారు.
మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేయకపోవడం.. మంత్రుల్లో కొంత మంది ఓడిపోవడం వంటి కారణాల వల్ల.. కేసీఆర్ ఈ సారి అన్ని వర్గాలకు అవకాశం కల్పించేందుకు కొంత కసరత్తు చేయాలనుకున్నారు. ముహుర్తం ప్రకారం బాగుండటంతో నేడు ప్రమాణస్వీకారం చేశారు. మైనార్టీ ఎజండాతో కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేయాలని అనుకుంటున్నందున.. తనతో పాటు మైనార్టీకి చాన్సిచ్చారు. గత ప్రభుత్వంలో కూడా మహమూద్ అలీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పాతబస్తీకి చెందిన మహమూద్ అలీకి ప్రజల్లో ఎలాంటి పలుకుబడి లేదు. ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు పదవి ఇవ్వడం వల్ల మజ్లిస్ అధినేత కు ఎలాంటి అభ్యంతరం లేదు. అందుకే ఆయనకే చాన్సిచ్చారు. కొనసాగిస్తున్నారు.
మిగతా కసరత్తు పూర్తి చేసి… పద్దెనిమిదో తేదీన కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. అదే రోజున అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించి.. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమాలు పూర్తి చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ పదవి కూడా కొత్తవారితోనే భర్తీ చేయాల్సి ఉంది. వీటన్నింటిపై పద్దెనిమిదో తేదీ లోపు కేసీఆర్ కసరత్తు పూర్తి చేసే అవకాశ ఉంది.