తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కనీసం కొన్ని ప్రముఖ శాఖలకు మంత్రులతోనైనా ప్రమాణం చేయించలేదు. సెంటిమెంట్ కోసం తనతోపాటు మరొకరితో కార్యక్రమం మమ అనిపించేశారు. వాస్తవానికి, పేరేడ్ గ్రౌండ్ లో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం ఉంటుందనీ, సంబరాలు ధూం ధామ్ గా ఉంటాయని కార్యకర్తలూ ఆశించారు. కానీ, నిరాడంబరంగా ఈ కార్యక్రమం ముగించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండ్రోజులైనా మంత్రి మండలి కూర్పు అంశమై కేసీఆర్ ఇంకా ఆలోచించలేదనే చెప్పాలి. ఎందుకంటే, ప్రస్తుతం ఆయన ఆలోచన అంతా జాతీయ రాజకీయాలవైపు ఉందనేది కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల వచ్చిన తరువాతి నుంచి వరుసగా ఆయన పాల్గొన్న మీడియా సమావేశాలే తీసుకుంటే… ఎక్కువగా జాతీయ స్థాయి సమస్యలు, రాజకీయాల గురించే మాట్లాడుతూ వచ్చారు. దానికి సంబంధించిన కార్యాచరణ గురించే ఎక్కువగా మాట్లాడారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి, విధివిధానాలను వెల్లడిస్తానంటూ చెప్పుకొచ్చారు.
రాష్ట్ర క్యాబినెట్ కూర్పులో కూడా కేసీఆర్ జాతీయ రాజకీయ ఆలోచనా విధానం ప్రాతిపదిక ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కులాలవారీగా మంత్రివర్గంలో సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలనే కసరత్తు ప్రస్తుతం జరుగుతోందని సమాచారం. ఇదే సమయంలో ఈసారి మహిళా మంత్రికి అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఆయనతోపాటే మహమూద్ అలీతో ప్రమాణ స్వీకారం చేయించడం ద్వారా మైనారిటీలకు ఇస్తున్న ప్రాధాన్యతను ముందే చెప్పేశారు. అయితే, ప్రస్తుతం కేసీఆర్ పార్టీకి చెందిన కొంతమందితో వరుసగా సమావేశమౌతారని తెలుస్తోంది. తనతోపాటు జాతీయ రాజకీయాలకు వచ్చేందుకు సిద్ధమైనవారిని ఎంపిక చేసుకుంటారట! ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారిలోంచి కూడా ఈ ఎంపిక ఉంటుందని అంటున్నారు. ఈ సమాలోచనల అనంతరం రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెరాస తరఫున ఎంపీలుగా పోటీ చేసివారిపై కూడా కొంత స్పష్టత వస్తుందని సమాచారం.
మంత్రి వర్గంలో చోటు ఆశిస్తున్నవారిలో కొంతమందికి పదవి దక్కదని చెబుతూ… తన వెంటే ఉండే టీమ్ లో సభ్యులుగా కొనసాగుతారనే భరోసా ఇవ్వడం, మంత్రి పదవి ఇవ్వడానికి ఆస్కారం లేనివారికి ఇతర అంశాల్లో ప్రాధాన్యత ఉంటుందనే హామీలను కేసీఆర్ ఇస్తారనీ పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి, జాతీయ రాజకీయాలపైనే కేసీఆర్ ఫోకస్ ఎక్కువగా ఉందనేది అర్థమౌతోంది. ఆ వ్యూహంతోనే మంత్రివర్గం కూర్పుపై ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది.