రాఫెల్ డీల్‌పై విచారణ కోసం… దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. రాఫెల్ ఒప్పంద ప్రక్రియలో అనుమానించదగ్గదేమీ లేదని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ తర్వాతప్రకటించారు. రాపెల్ ఒప్పందం, ధరల విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు కన్పించట్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒప్పందంలో ప్రయివేటు సంస్థకు వాణిజ్య లబ్ధి చేకూరుతుందని చెప్పేలా సాక్ష్యాలేమీ లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం.. రిలయన్స్ డిఫెన్స్ యజమాని అనిల్ అంబానీకి ఉరట లభించేదే…! రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అనధికారికంగా లభించిన సమాచారం ప్రకారం.. మీడియాలో విస్తృతంగా వచ్చిన కథనాల ప్రకారం చూస్తే.. ఓ భారీ కుంభకోణం జరిగిందనే విషయాన్ని ప్రజలు నమ్ముతున్నారు.
దీనికి సంబంధించి .. ఆధారాలతో అనేక మంది పిటిషన్లు దాఖలు చేశారు. యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ఎంఎల్ శర్మలు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం నుంచి సీల్డ్ కవర్లో వివరాలు తీసుకుంది. చివరికి.. అనుమానించదగ్గ అంశాలేవీ లేవన క్లిన్ చిట్ ఇచ్చింది. రాఫెల్ డీల్‌ను ఆధారంగా చేసుకునే… రాహుల్ గాంధీ… మోడీపై విరుచుకుపడుతున్నారు. ప్రజల సొమ్మును కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. ఆయనకు ఇబ్బంది కలిగించేదే. అదే సమయంలో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీజేపీకి మాత్రం.. ఊరట కలిగిస్తుంది.
కానీ.. రాఫెల్ విషయంలో అనేక అనుమానాలు ప్రజల్లో ప్రారంభమయ్యాయి. కచ్చితంగా స్కాం జరిగిందనేలా.. అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటన్నింటిపై.. కేంద్రం మాట్లాడటం లేదు. వివరణలు ఇవ్వడం లేదు. హెచ్ఏఎల్కు కాదని… రిలయన్స్‌కు ఎందుకు ఆఫ్సెట్ పార్టనర్‌గా చేర్చుకున్నారనే దాని దగ్గర్నుంచి… భారీగా రేటు పెంపు, నిబంధనల మార్పు వంటి అనేక అంశాలపై ప్రజల్లో అనుమానాలున్నాయి. రహస్యం పేరుతో వాటిని కేంద్రం దాచి పెడుతూండటంతోనే ఆ అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. వాటిపై ప్రజలకు క్లారిటీ ఇవ్వకపోతే.. సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా… ప్రజల్లో నమ్మకం కలగకపోవచ్చు.