రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో సీనియర్లకే ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని రాహుల్ గాంధీ నిర్ణయించారు. మధ్యప్రదేశ్ మాదిరిగానే, రాజస్తాన్‌కు కూడా సీనియర్ నేత అశోక్ గెహ్లట్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. సచిన్ పైలట్‌ను డిప్యూటి సీఎంగా ప్రకటించింది. రాజస్తాన్ సీఎం పదవికి సీనియర్ నేత గెహ్లట్‌తో పాటు యువ నేత సచిన్ పైలట్ కూడా పోటీపడ్డారు. ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై తర్జనభర్జన పడ్డారు. ఈ చర్చల్లో ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు.
పార్టీలో అంతర్గత విభేదాలను, సంపూర్ణ మెజారిటీ లేని ప్రభుత్వాలను సమర్ధవంతంగా నడపడం సీనియర్లకే సాధ్యమని సోనియా, ప్రియాంక నమ్మారు. ఈ రెండు కీలక రాష్ట్రాల నుంచి అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలంటే సీనియర్లకే అవకాశం ఇవ్వడం మంచిదని ఆ మేరకు నిర్ణయం తసుకున్నారు. మధ్యప్రదేశ్ సీఎంగా ఈ నెల 17న కమల్ నాథ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్ మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. యువనేత జ్యోతిరాదిత్య సింధియా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం కమల్ నాథ్ వైపే మొగ్గుచూపింది.కమల్ నాథ్.. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేత. కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవమూ ఉంది. ఆయన మూడుతరాలుగా గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడు. చింద్వారా లోక్ సభ స్థానం నుంచి తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన ఘనత కూడా ఆయనకు సొంతం.
మరో వైపు మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించిన చత్తీస్ ఘడ్ లో మాత్రం సీఎం ఎంపికపై ఇప్పటికీ కసరత్తు చేస్తున్నారు. నాలుగు నెలల్లో రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో మెజార్టీ స్థానాలను పొందడమే కాంగ్రెస్ ప్రస్తుత లక్ష్యంగా పెట్టుకుంది. అది సీనియర్ల ద్వారానే సాధ్యమవుతుందని నమ్ముతోంది.