తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ … తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ప్రకటించడం బహిరంగ రహస్యం. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం మొత్తం కొన్ని రోజుల పాటు జగన్ పాదయాత్రను కూడా పట్టించుకోకుండా… టీఆర్ఎస్ కోసం పని చేసిందనేది నిజం. వైసీపీ శ్రేణులు క్షేత్ర స్థాయిలో సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించడానికి టీఆర్ఎస్ నేతల కన్నా ఎక్కుగా ప్రయత్నించాయనేది నిజం. అందుకే.. కూకట్పల్లిలో గెలిచిన మాధవరం కృష్ణారావు.. తనకు సహకరించిన జగన్మోహన్ రెడ్డికి నిర్మోహమాటంగా.. కెమెరా సాక్షిగా కృతజ్ఞతలు కూడా చెప్పారు. అంటే.. టీఆర్ఎస్ అడిగిందో.. అడగలేదో కానీ… టీడీపీపై ఉన్న కోపంమతోనే… ప్రజాకూటమి తెలంగాణలో అధికారంలోకి వస్తే… తమకు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్న అంచనాతోనో కానీ… వైసీపీ నేతలు టీఆర్ఎస్ను కావలించుకున్నారు. అనుకున్నది సాధించారు.
కానీ ఇప్పుడేం జరుగుతోంది. కేసీఆర్… జగన్కు మంచి చేద్దామనుకుంటున్నారో… చంద్రబాబుపై కసి తీర్చుకోవాలనుకుంటున్నారో కానీ… ఉన్న పళంగా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామంటున్నారు. ఇదేదో చంద్రబాబుకు హెచ్చరికలాగా ఉందని.. వైసీపీ నేతలు సంతోషపడుతున్నారు కానీ… లోతుగా ఆలోచిస్తే.. కేసీఆర్ … తమకు మద్దతు ఇచ్చిన కృజ్ఞతతతో.. ఏపీలో వైసీపీకి మద్దతు ఇస్తే.. అది రివర్స్ అవుతుందని నిర్ణయించేసుకున్నారు. తమకు మద్దతు ఇస్తే… చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్లేనని డిసైడయ్యారు. అందుకే.. వెంటనే ప్లేటు ఫిరాయించేశారు. అసలు కేసీఆర్కు.. వైసీపీకి సంబంధం ఏమిటనే వాదన తెరపైకి తీసుకు వచ్చారు. కేసీఆర్తో తమ అసోసియేషన్… పార్టీకి డ్యామేజ్గా మారుతూండటంతో… బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపారు. ఆయన తనదైన శైలిలో… అసలు టీఆర్ఎస్తో తమకు ఎందుకు సంబంధాలు అంట గడుతున్నారని ప్రశ్నించారు.
వైసీపీ నేతల అత్యుత్సాహంతో… సంబంధాలు తమకు తామే అంటగట్టుకున్నారు కానీ.. ఎవరు అంటగట్టారు. చంద్రబాబు టీఆర్ఎస్తో పొత్తు కోసం ప్రయత్నించారని… యాగాలకు వెళ్లారని… కేసీఆర్ విజయవాడకు వస్తే.. టీడీపీ మంత్రులు ఆహ్వానాలు పలికారని… చెప్పుకొస్తున్నారు. అవన్నీ సరే కానీ.. అసలు ఎన్నికల్లో సపోర్ట్ చేసింది ఎవరనేదే కదా అసలు పాయింట్. ఇప్పుడీ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆంధ్రుల్ని ఘోరంగా అవమమానించిన టీఆర్ఎస్తో .. జగన్ లోపాయికారీ వ్యవహారాలు నడుపుతున్నారని టీడీపీ ప్రచారం చేస్తోంది. దీన్ని జనం నమ్ముతున్నారు కూడా. వైసీపీ నేతలు అంత ఓవరాక్షన్ చేశారు మరి…! దీన్నుంచి బయటపడాలంటే.. వైసీపీ కాస్త కష్టమైన వ్యవహారమే..!