అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎదురులేని నేతలు అనుకున్న కాంగ్రెస్ పెద్దలంతా… తమ తమ నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారు. వాళ్ల ఓటమి వాళ్లను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒకరిద్దరం కాదు.. దాదాపుగా… అందరూ ఓడిపోవడం ఏమిటన్న చర్చ వచ్చినా… ఏమీ చేయలేరు కనుక.. ఎవరికి వారు.. భవిష్యత్ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వారి దృష్టి.. ఐదు నెలల్లో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికలపై పడింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు కనిపిస్తున్న తరుణంలో… అసెంబ్లీ స్థానంలో ఓడిపోవడం మన మంచికేనన్న ఫీలింగ్‌కి ఇప్పుడిప్పుడే వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెడుతున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఆదిలాబాద్ వరకూ.. చాలా బలమైన నేతలు.. ఈ సారి కాంగ్రెస్ పార్టీ తరపున లోక్‌సభ నియోజకవర్గాల్లో నిలబడే అవకాశం కనిపిస్తోంది.
ఖమ్మం, మహబూబ్ బాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థులకే మెజార్టీ వచ్చింది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పార్లమెంట్‌కే పోటీ చేయాలని సన్నాహాలు చేసుకున్నారు. కానీ అసెంబ్లీ బరిలో నిలబడాల్సి వచ్చింది. కానీ ఓడిపోయారు. ఇప్పుడాయన పార్లమెంట్ పై దృష్టి పెట్టినా ఆశ్చర్యం లేదు. ఒక వేళ కాంగ్రెస్‌కే ఇస్తే రేణుకా చౌదరి ఉండనే ఉన్నారు. ఇక మహబూబాబాద్‌లో మాజీ ఎంపీ బలరాం నాయక్ కూడా ఓడిపోయారు. ఆయన కాకపోయినా.. గిరిజన వర్గాల్లో బలం ఉన్న నేతలు ఉన్నారు. ఇక నల్లగొండలో పోటీకి… కోమటిరెడ్డి వెంకటరెడ్డి కసరత్తు ప్రారంభించారు కూడా. ఆయన తన మనసులోని మాటని మీడియా ముందుకు చెప్పారు. అంటే హైకమాండ్ కు సూచనలు పంపినట్లే. జానారెడ్డి కూడా ఆ ఆశతో ఉండొచ్చు. నల్లగొండ కాకపోతే.. భువనగరి కూడా ఉంది. ఈ స్థానాలకు గట్టిగా పోటీ పడే అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీలో లేరు. ఇక లోక్ సభ ఎన్నికల్లో పోటీకి రేవంత్ రెడ్డి, డీకే అరుణ లాంటి వాళ్లు రెడీగా ఉన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని జైపాల్ రెడ్డి ఉండనే ఉన్నారు. ఆదిలాబాద్ లో రమేష్ రాథోడ్, నిజామాబాద్ లో మధుయాష్కీ గౌడ్ సహా చాలా మంది సీనియర్లు రేసులో ఉన్నారు.
వీరిలో కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి వంటి సీనియర్లకు ఓటర్లలో సానుభూతి ఇప్పటికే కనిపిస్తోంది. ప్రజల కష్టపడినా.. టీఆర్ఎస్ పై పోరాడినా … ఓడిపోయారనే సానుభూతి కనిపిస్తోంది. దాంతో.. వారికి అనుకూల పవనాలు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. అలాగే వచ్చే ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ అన్నట్లుగా సాగుతాయని.. విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. రాహుల్‌కి అడ్వాంటేజ్ అవుతుది. అంటే.. కాంగ్రెస్ పార్టీకి ఆటోమేటిక్‌గా ఓట్లు స్వింగ్ అవుతాయి. అందుకే ఓడిపోయామనే సంగతి మర్చిపోయి.. కాంగ్రెస్ సీనియర్లు పార్లమెంట్‌కు రెడీ అవుతున్నారు.