ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అన్న అంశాన్ని పక్కన పెట్టి… ఏకైక ఎజెండాగా.. బీజేపీని ఓడించడాన్ని పెట్టుకోవాలని బీజేపీయేతర మిత్రపక్షాలన్నీ .. దాదాపుగా నిర్ణయించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల్లో కూడా… ఇదే కీలక అంశం. రాహుల్‌తో సమావేశమైనప్పుడు కానీ.. ఆ తర్వాత బీజేపీయేతర పక్షాలను ఏకం చేసినప్పుడు కానీ.. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ప్రశ్న అసందర్భమని స్పష్టంగా మీడియాకు వెల్లడించారు. మోడీకి ధీటైన నేతలు తమ కూటమిలో చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. దీనికి కారణం… రాహుల్ గాంధీ .. ప్రధాని అభ్యర్థిత్వాన్ని అంగీకరించడానికి చాలా మంది సిద్ధం లేకపోవడమే. అయితే డీఎంకే అధినేత స్టాలిన్ ఈ విషయంలో తేనెతుట్టేను కదిపారు. కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి రాహులేనంటూ ప్రకటించారు. చెన్నైలో కరుణానిధి విగ్రహావిష్కరణ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. దాంతో బీజేపీయేతర కూటమిలో ఉంటాయనుకుంటున్న కొన్ని పార్టీల్లో అప్పుడే అలజడి ప్రారంభమయింది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే.. విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అనివార్య పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో… ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు ప్రాంతీయ పార్టీల్లో చాలా మంది ఉన్నారు. మమతా బెనర్జీ, మాయావతి, శరద్ పవార్ లాంటి వాళ్లు ఉన్నారు. వీరందరూ… కాంగ్రెస్ నేతృత్వంలో పని చేయడానికి సిద్ధపడినా… ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్‌ను ప్రకటించడానికి.. అంగీకరించడానికి సిద్ధంగా లేరు. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా… వారు రాహుల్ గాంధీ నాయకత్వానికి సిద్ధపడటం లేదు.
ఇలాంటి సమయంలో.. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారంలో… విపక్షాల ఐక్యతను ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి స్టాలిన్ ప్రకటన కాస్త ఇబ్బందికరంగానే మారింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ ప్రమాణస్వీకారోత్సవానికి .. మమతా బెనర్జీ గైర్హాజరవ్వాలని నిర్ణయించారు. అయితే కూటమి విషయంలో తాను పాజిటివ్ గానే ఉంటాననే సంకేతాలు పంపారు. పార్టీ ప్రతినిధిని పంపుతున్నారు. అంటే… బీజేపీయేతర కూటమికి ఓకే కానీ.. రాహుల్ నాయకత్వానికి మాత్రం ఆమె సిద్దంగా లేరన్నమాట. చాలా పార్టీలది అదే పరిస్థితి. ..