కేసీఆర్ మంత్రివర్గాన్ని ఇప్పుడిప్పుడే విస్తరించాలనుకోవడం లేదన్న సూచనలు ప్రగతి భవన్ నుంచి మీడియాకు వస్తున్నాయి. కేసీఆర్ కాకుండా పదిహేడు మంది మంత్రులు కేబినెట్‌లో ఉండొచ్చు. కానీ ఒక్క మహమూద్ అలీతోనే కేసీఆర్ సరిపెట్టారు. మళ్లీ వారం రోజుల్లో విస్తరణ చేస్తామని మొదట్లో హింట్ ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం … నెలాఖరులో కొన్ని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరికొన్ని అంటూ.. మీడియాకు లీకులు ఇస్తున్నారు. దీని వెనుక కేసీఆర్ తనదైన రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఈ సారి మంత్రివర్గ కూర్పును ఆయన ఆషామాషీగా తీసుకోవటం లేదని కేసీఆర్ సన్నిహిత వర్గాల చెబుతున్నాయి. నూటికి నూరు శాతం విధేయులనే ఈసారి కేబినెట్‌లోకి తీసుకోవాలని కేసీఆర్ గట్టిగా నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఈ విధేయత కొలమానం ఎలా ఉంటుంది..?. టీఆర్ఎస్‌లో ఇప్పుడు ఉన్న వాళ్లంతా… 90 శాతానిపైగా… పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనో… ఇతర పార్టీల్లో భవిష్యత్ లేదని నిర్ణయించుకున్న తర్వాత వచ్చిన వాళ్లే్. అనివార్యంగా వారిలో చాలా మందికి కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వవలసి వచ్చింది. ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకే విధేయతకు ఈ సారి కొలమానాన్ని మార్చుకున్నారని చెబుతున్నారు. కుమారుడు కేటీఆర్ నాయకత్వాన్ని ఎవరు ఎంత ఎక్కువగా బలపరుస్తారో వారికే మంత్రి పదవులు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల పర్యటనలు చేయబోతున్నారు. ఆ లోపే.. పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. అంతకు ముందే పంచాయతీ ఎన్నికలు కూడా జరపబోతున్నారు. వీటన్నింటి విషయంలో… కేటీఆర్ నాయకత్వంపై అత్యధిక విధేయత చూపి… ఫలితాలు సాధించిన వారికే పట్టం కట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే… ఇప్పటికే.. ఏ పార్టీలో ఉన్నా… హైకమాండ్ దగ్గర తమదైన ముద్ర వేయించుకునే వ్యవహారాల్లో
రాటుదేలిపోయిన దానం నాగేందర్, తలసాని లాంటి వాళ్లు.. పరుగులు పెడుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించేకార్యక్రమంలో హడావుడి అంతా వీరిదే మరి..!