తెలంగాణ రాష్ట్ర సమితి క్యాంప్ నుంచి కొద్ది రోజులుగా.. ఓ ప్రచారం చాలా జోరుగా సాగుతోంది. పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రాబోతున్నారని ఆ ప్రచార సారాంశం. స్వయంగా కేసీఆర్ మీడియాతో చిట్ చాట్‌లోనే ఈ విషయాన్ని ప్రస్తావించడంతో.. వలసలు ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. నిజానికి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలందరూ ఓడిపోవడం… 88 మంది ఎమ్మెల్యేలు గెలుపొందడంతో కేసీఆర్ ఇక .. ఆపరేషన్ ఆకర్ష్ లాంటివేమీ పట్టించుకోరని… చాలా మంది అనుకున్నారు. కానీ.. ఆయన మాత్రం అందరి కంటే భిన్న కోణంలో రాజకీయం చేస్తారు కాబట్టి… కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 19 మందిలో 12మందిని టీఆర్ఎస్‌లో చేర్చుకోవాలనుకుంటున్నారు.
ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయేమో తెలియదు కానీ.. మంత్రివర్గ విస్తరణ కూడా.. అలా వచ్చే ఎమ్మెల్యేల కోసమే నిలుపుదల చేస్తున్నామన్న లీకులు మాత్రం ప్రగతి భవన్ నుంచి మీడియాకు వస్తున్నాయి. ఇప్పటికే ఎనిమిది మంది ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి గులాబీ కండువా కప్పించుకుంటారని.. చెబుతున్నారు. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములునాయక్ ఇప్పటికే టీఆర్ఎస్ లోచేరిపోయారు. అంటే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరింది. ఇప్పుడు మరో పన్నెండు మంది ఎమ్మెల్యేల లెక్క చెబుతున్నారు.
నిజానికి ఇలాంటి పరిస్థితి వస్తే.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తే.. అది ప్రజల్లో అసహనానికి కూడా దారి తీయవచ్చన్న అంచనాలు ఉన్నాయి. తాము చేసే తప్పుల్ని ప్రశ్నించేవారిని సహించడానికి ప్రభుత్వం ఏ మాత్రం సిద్దంగా లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడితే మొదటికే మోసం వస్తుందన్న అభిప్రాయంలో టీఆర్ఎస్ సీనియర్లు ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో .. ఎవరూ… టీఆర్ఎస్ అధినేతకు సలహాలిచ్చేంత ధైర్యం ఎవరికీ లేదు.