టిట్లీ తుపాను బీభత్సం కళ్ల ముందు కనిపిస్తూండగానే.. అంత కంటే ఎక్కువ విధ్వసం సృష్టిస్తుందని భయపడ్డ పెథాయ్ తుపాను.. కాస్త నెమ్మదించి తీరం దాటింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద ఇది తీరం తాకినట్లు వాతావరణశాఖ ప్రకటించారు. తుపాను ప్రభావం ఏడు జిల్లాలపై పడింది. ఈ కారణంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి. విమాన రాకపోకలపై కూడా ప్రభావం పడింది. విశాఖకు రావాల్సిన 14 విమానాలను రద్దు చేశారు. తుపాను దృష్ట్యా తీరప్రాంత జిల్లాల్లో ఇప్పటికే పాఠశాలకు సెలవు ప్రకటించారు. పెథాయ్ తుపాను బీభత్సం తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంది. ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. తుపాను ప్రభావం ఉన్న 51 మండలాలకు 51 మంది ప్రత్యేకాధికారుల్ని నియమించారు.
దక్షిణ కోస్తా నుంచి ఉత్తరాంధ్ర వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కూలాయి. కృష్ణా జిల్లాలో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. నాలుగు జిల్లాల్లో 59,976 హెక్టార్లలో పంట దెబ్బతిదని ప్రాథమికంగా ప్రభుత్వం అంచనా వేసింది. తుపాను తీరం దాటిన కాట్రేనికోనకు హుటాహుటిన సహాయ సామాగ్రి తరలించారు. 18 మండలాల్లోని 295 గ్రామాల్లో పునరావాస చర్యలు ప్రారంభించారు. 84 జేసీబీలు, 83 జనరేటర్లు, 87 వాటర్ ట్యాంకర్లు..5 లక్షల వాటర్ ప్యాకెట్లు పంపించారు. నిత్యావసర వస్తులను కూడా తరలించారు. రాజమండ్రి, విశాఖ ఎయిర్‌పోర్టుల్లో అనుకూలించని వాతావరణం కారణంగా..సీఎం ప్రత్యేక విమానం ల్యాండింగ్‌కు అనుమతి దొరకలేదు. తుపాను ప్రభావిత ప్రాంతాల్ని మంగళవారం ముఖ్యమంత్రి పరిసీలించే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్రను వణికించిన టిట్లీ, హుదూద్ స్థాయిలో కాకపోయినా… పెథాయ్ ప్రతాపం కూడా… బాగానే చూపించింది. పెద్ద ఎత్తున పంటలు నష్టపోవడంతో.. భారీగా ఆస్తి నష్టం సంభవించిందన్న అంచనాలు ఉన్నాయి. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కానీ.. ఎంత మేర విధ్వంసం జరిగిందనేది.. ప్రభుత్వానికి కూడా అర్థమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.