తెలుగు మోవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు డా. రాజేంద్ర ప్రసాద్ గురువారం తిరుమలకి వచ్చినప్పుడు ఆయన మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా “నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఈయవలసిన డబ్బు గురించి నిర్మాతల మండలితో మాట్లాడి ఆ సమస్యను ఇద్దరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించాము,” అని అన్నారు.
పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే దాని పైరసీ కాపీలు మార్కెట్లోకి విడుదల కావడంతో, వాటి వలన సినిమా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, ఆ కారణంగా ఆ సినిమా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నష్టపోకూడదనే మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఆయనకి రెండు కోట్లు తిరిగి ఇచ్చేరు. కానీ ఆ సినిమా ఊహించిన దానికంటే సూపర్ హిట్ అయ్యింది. కనుక నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ కూడా అదే మంచితనం ప్రదర్శించుకొని పవన్ కళ్యాణ్ కి ఆ డబ్బు వాపసు చేసి ఉండాలి. కానీ ఆయన ఆ తరువాత తీస్తున్న “నాన్నకు ప్రేమతో” సినిమా నిర్మాణానికి డబ్బుకి ఇబ్బంది పడుతున్నందున దాని విడుదల వరకు సమయం కోరారు. అందుకు పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు. సినిమా విడుదలకి సన్నాహాలు పూర్తయ్యాయి కానీ నిర్మాత మాత్రం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ ‘మా’కి పిర్యాదు చేసారు. అప్పుడు మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కలుగజేసుకొని సమస్యని పరిష్కరించారు. నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ విజ్ఞప్తి మేరకు పవన్ కళ్యాణ్ తనకు రావలసిన రెండు కోట్లలో రూ.50 లక్షలు తగ్గించుకొన్నారని సమాచారం.