తెలంగాణ రాష్ట్ర సమితిలో వారసత్వ చర్చ ఒకప్పుడు ఉండేది. ఓ రెండు మూడు ఆప్షన్లు తెరమీదుండేవి. ఇప్పుడదంతా నెమ్మదిగా క్లియర్ అవుతూ అవుతోంది. భిన్నాభిప్రాయాలకు ఆస్కారం లేకుండా… ఇతరత్రా చర్యలకు సందు ఇవ్వకుండా ఒక పద్ధతి ప్రకారం తన రాజకీయ వారసత్వాన్ని సెట్ చేసుకుంటూ పోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నికల ఫలితాల తరువాత జరిగిన రెండు ప్రముఖ కార్యక్రమాల తీరుని గమనిస్తే… ఆ లెక్క మరింత స్పష్టంగా అర్థమైపోతుంది. రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా ఉంటుందని చాలామంది ఆశించారు. పెద్ద సంఖ్యలో ప్రజల మధ్య ఆ కార్యక్రమం ఉంటుందనుకున్నారు. కానీ, ఎలాంటి హడావుడీ లేకుండా… రాజ్ భవన్ లో కొద్దిమంది సమక్షంలో నిరాడంబరంగా పదవీ స్వీకార ప్రమాణం చేసేశారు.
ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమాన్ని తెలంగాణ భవన్ లో నిర్వహించారు. అది కూడా వందలమంది మధ్యలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జనాల మధ్య అత్యంత హడావుడిగా నిర్వహించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం… పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతల స్వీకరణ… ఈ రెండు కార్యక్రమాల మధ్యా స్పష్టమైన తేడా కనిపించేలా నిర్వహించారు! కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నారు, కేటీఆర్ ప్రజల్లో ఉంటారు… ఇదే సంకేతాలు స్పష్టంగా ఇచ్చినట్టు లెక్క. సమీప భవిష్యత్తులో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన పరిస్థితులను కేసీఆర్ క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు.
పార్టీ బాధ్యతలు చేపట్టాక ప్రస్తుతం కేటీఆర్ ముందున్న ఛాలెంజ్ లు.. పంచాయతీ ఎన్నికలు, ఆ తరువాత జరగబోయే లోక్ సభ ఎన్నికలు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయాలంటే… క్షేత్రస్థాయిలో జరిగే ఈ ఎన్నికలు కీలకమైనవే అవుతాయి. దీంతోపాటు, జాతీయ రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాలన్న భారీ లక్ష్యం పెట్టుకున్న తెరాసకి… లోక్ సభ ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకమైనవి. ఒకవేళ… లోక్ సభ ఎన్నికల తరువాత, కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే మార్గం సుగమంగా కనిపిస్తే… రాష్ట్ర బాధ్యతలు కేటీఆర్ కి ఇవ్వడం దాదాపు ఖాయం. దానికి అనువైన పరిస్థితే ఇప్పుడు కేసీఆర్ సృష్టించింది పెట్టారు. అందుకే, కేటీఆర్ కూడా కొన్నాళ్లపాటు పార్టీ బాధ్యతలే చూసుకుంటాను అంటున్నారు. అంటే, లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యేవరకూ.. రాష్ట్ర మంత్రివర్గంలో కూడా కేటీఆర్ కి స్థానం ఉండకపోవచ్చు. ఆ తరువాత, కేసీఆర్ అటెళ్తే… కేటీఆర్ ఇటొస్తారు. సో… ఇవన్నీ పక్కా విజన్ తో జరుగుతున్న పరిణామాలే.