పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటన దిగ్విజయంగా సాగింది. వేలాది మంది అభిమానులు పవన్ కళ్యాణ్ ని చూడడానికి, ఆయన స్పీచ్ వినడానికి తరలివచ్చారు. గంటల తరబడి వేచి ఉన్నారు. ఇన్స్పిరేషనల్ గా సాగిన ఆయన స్పీచ్ ని ఆసక్తికరంగా విన్నారు, జేజేలు పలికారు. అయితే ఇంతటి ఉపన్యాసం మధ్యలో ఒక చిన్న పొరపాటు దొర్లింది. జరిగిన పొరపాటున కూడా పవన్ కళ్యాణ్ వెంటనే గుర్తించి దాన్ని అక్కడికక్కడే సరిదిద్దుకున్నారు. అయితే ఇప్పుడు ఆ చిన్న పొరపాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్, భగత్ సింగ్ గురించి మాట్లాడుతూ, 23 ఏళ్ల వయసులో దేశం కోసం భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు అని వ్యాఖ్యానించాడు. అయితే భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకోలేదు, బ్రిటిష్ వాళ్ళు ఆయనను ఉరితీశారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ కి కూడా తెలుసు. జరిగిన పొరపాటును వెంటనే సరి చేసుకుంటూ, బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ ఉరి వేశారని, అంత చిన్న వయసులో ప్రాణాలను బలిదానం చేసే ధైర్యం ఎవరికీ ఉంటుందని వ్యాఖ్యానించి తను పొరపాటు గా మాట్లాడిన మాటని అక్కడికక్కడే సరిదిద్దుకున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లోనే మొదటి సగం- అంటే పొరపాటుగా మాట్లాడిన మాట వరకు వీడియో కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసారు. పవన్ కళ్యాణ్ కి చరిత్ర ఏ మాత్రము తెలియదని చిత్రీకరించడానికి కొంతమంది తెగ ప్రయత్నించారు, పవన్ కళ్యాణ్ ని తెగ ట్రోలింగ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పూర్తి వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అబద్ధ ప్రచారానికి తెరదించే ప్రయత్నం చేశారు. మొత్తానికి అటు పవన్ ప్రత్యర్థుల ట్రోలింగ్ లతో, ఇటు పవన్ అభిమానుల కౌంటర్ లతో, సోషల్ మీడియా కొన్ని గంటల పాటు ఊగి పోయింది.