అల్లు అర్జున్ మాట్లాడితే… అందులో సగం ట్రోలింగ్కి పనికొచ్చేవే ఉంటాయి. బహిరంగ వేదికలపై బన్నీ ఇచ్చిన స్పీచులకు కౌంటర్లెన్నో పడ్డాయి. `చెప్పను బ్రదర్` అని నోరు జారిన పాపానికి… పవన్ ఫ్యాన్స్ దగ్గర అడ్డంగా బుక్కయిపోయాడు. అయితే… బన్నీ మాటల్లో ఈమధ్య మెచ్యూరిటీ ఎక్కువైంది. ఆచి తూచి మాట్లాడుతున్నాడు. అందులో పనికొచ్చే విషయాలు కాసిన్ని ఎక్కువే ఉన్నాయి. ‘పడి పడి లేచె మనసు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి బన్నీ అతిథిగా వచ్చాడు. తన స్పీచ్.. ఈ ఫంక్షన్‌కే హైలెట్ అనుకోవాలి.
తనకంటే చిన్నవాడైన శర్వానంద్‌ని `గారూ` అని పిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు బన్నీ. ఆ తరవాత.. `గారూ` పిలుపు వెనుక ఉన్న అంతరార్థం వివరించాడు. ఎదుటివాళ్ల స్టేచర్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి, సినిమా నటుల్ని, రాజకీయనాయకుల్ని… ఏక వచనంతో పిలుస్తున్నారని, విమర్శించడంలో తప్పులేదు గానీ, గౌరవించడం నేర్చుకోవాలి అన్నాడు బన్నీ. టీవీ చూస్తున్నప్పుడు ‘ఒరేయ్ చిరంజీవిని పిలు…’ అని ఎవరో గౌరవం లేకుండా మాట్లాడారని గుర్తు చేశాడు. ‘చిరంజీవి ఏంట్రా.. చిరంజీవి గారు.. పవన్ కల్యాణ్ గారూ.. కేసీఆర్ గారూ.. చంద్రబాబు నాయుడు గారూ’ అంటూ గౌరవ వచనాల్ని చేర్చాడు బన్నీ. రాజకీయ నాయకులు అయిపోయినంత మాత్రాన… గౌరవించకూడదని ఎవరూ ఎక్కడా చెప్పలేదని, ముందు ఎదుటి వ్యక్తుల్ని గౌరవించడం నేర్చుకోమని సినీ, రాజకీయ అభిమానులకు సూచించాడు. వేదికపై నటీనటుల గురించి మాట్లాడుతున్నప్పుడు, టెక్నీషియన్ల గురించి చెబుతున్నప్పుడు బన్నీ ‘గారు’ అనే గౌరవ వాచకం జోడించే మాట్లాడాడు. సాయి పల్లవిని కూడా ‘గారూ’ అంటూ సంబోధించాడు.
బన్నీ టాపిక్ ఇదే ఎందుకు అయ్యింది?
బన్నీ స్పీచు బాగుంది గానీ.. సడన్‌గా ఈ `గారూ` ఎందుకు గుర్తొచ్చిందన్నది అభిమానుల అనుమానం. దీనికి రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి.. వేదికపై బన్నీ కంటే ముందు శర్వా మాట్లాడాడు. శర్వా బన్నీని ఏక వచనంతో పిలిచాడు. అది బన్నీని హర్ట్ చేసి ఉండొచ్చన్నది ఓ అనుమానం. రెండోకారణం.. ఈమధ్య పవన్ కల్యాణ్‌ని ‘వాడు.. వీడు’ అంటూ టీవీ డిబేట్లలో అమర్యాదపూర్వకంగా పిలుస్తున్నారు. అది కూడా బన్నీ దృష్టిలో పడి ఉండొచ్చు. ఏదేమైనా.. ఈ వేదికపై నుంచి బన్నీ ఓ మంచి మాట మాట్లాడాడు. అల్లు అర్జున్ అభిమానులే కాదు.. ప్రతీ సినీ అభిమానీ… ఈ మాటల్ని మననం చేసుకుంటే మంచిది.