ఈనెల 21న విడుదల అవుతున్న చిత్రాలలో ‘అంతరిక్షం’పై మంచి అంచనాలే ఉన్నాయి. ‘ఘాజీ’తో ఆకట్టుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. అంతరిక్షం నేపథ్యంలో ఇప్పటి వరకూ తెలుగులో సినిమా రాలేదు. దాంతో… ఈ సినిమాని ఎలా తీసుంటాడా? అని యావత్ తెలుగు చిత్రసీమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అంతరిక్షం అనగానే.. సైన్స్ ఫిక్షన్ అని ఈజీగా ఊహించొచ్చు. అయితే.. ఇందులోనే ఓ లవ్ స్టోరీని మిక్స్ చేశాడట సంకల్ప్ రెడ్ది. ఆ లవ్ స్టోరీ కాస్త యండమూరి వీరేంద్రనాథ్ నవల ‘చీకట్లో సూర్యుడు’ లోని పాయింట్‌కి అత్యంత దగ్గరగా ఉంటుందని టాక్.
చీకట్లో సూర్యుడు నవల లో కూడా ఇలా అంతరిక్షం, ప్రేమకథ మిక్సయి ఉంటాయి. కథానాయకుడు. నాయిక ఇద్దరూ అస్ట్రోనాట్లే. వారిద్దరికీ బ్రేకప్ అవుతుంది. అనుకోకుండా వాళ్లిద్దరే కొంతకాలం అంతరిక్షంలో ఉండాల్సివస్తుంది. అప్పుడు వాళ్లిద్దరి మధ్యన ఎలాంటి పరిస్థితులు తలెత్తాయన్నది ‘చీకట్లో సూర్యుడు’ కథ. అంతరిక్షం కథ కూడా ఈ నవలకు అటూ ఇటుగా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అవునో కాదో తెలియాలంటే ఈనెల 21 వరకూ ఎదురుచూడాల్సిందే.