ఎన్నికలు వచ్చాయంటే… దినపత్రికలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఓ పదేళ్ల కిందట..పత్రికలో కవరేజీ రావాలంటే.. కచ్చితంగా దానికో న్యూస్ ప్రయారిటీ ఉండాలి. కానీ… కొన్నాళ్ల నుంచి పెయిడ్ న్యూస్ ప్రాధాన్యత పెరిగిపోయింది. కేవలం ప్రచారం చేశారన్న వార్త వేయించుకోవడానికి కూడా.. అభ్యర్థులు డబ్బులు వెదజల్లడం ప్రారంభించారు. దాంతో… అసలు న్యూస్‌లో ఈ పెయిడ్ న్యూస్ కలిపి వార్తలు ఇవ్వడం ప్రారంభించారు. వందల కోట్లు ఇలా పత్రికలు వెనకేసుకున్నాయని ప్రచారం జరిగింది. ఈ పైత్యం ముదిరిపోవడంతో… చివరికి ఎన్నికల సంఘం కూడా.. పెయిడ్ న్యూస్‌ని నిషేధించింది. కానీ.. అసలు న్యూస్‌ని.. పెయిడ్ న్యూస్‌ని వేరు చేయడం… ఈసీకి చేత కాదు. అందుకే ఇప్పటి వరకూ… ఒక్కటంటే.. ఒక్క న్యూస్ పేపర్‌పైనా చర్య తీసుకోలేదు.
ఈ పెయిడ్ న్యూస్ మార్కెటింగ్ వ్యవహారాల్లోని లొసుగుల కారణంగా ఉద్యోగులు భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ఫలితంగా ఇద్దరు యూనిట్ మేనేజర్లను ఉన్న పళంగా ఉద్యోగం నుంచి తీసేశారని సాక్షిలోని ఉద్యోగులు చెబుతున్నారు. పెయిడ్ న్యూస్ పేరుతో రెండు జిల్లాలో భారీగా డబ్బులు వసూలు చేశారు కానీ.. వ్యక్తిగత ఖాతాలో వేయించుకుని… అవి మామూలు వార్తల్లానే కవర్ చేశారని.. అలా.. అభ్యర్థిని శాటిస్ ఫై చేసి. .. ఇటు యాజమాన్యాన్ని టోకరా కొట్టించారని విచారణలో తేలింది. అయితే.. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలు… ఒకరిద్దరు చేయడం సాధ్యం కాదు. సాక్షిలో ఉన్నత స్థానంలో ఉన్న వారి ప్రమేయం లేకుండా సాధ్యం కాదన్న అనుమానాలు సాక్షి కాంపౌండ్‌లో వినిపిస్తున్నాయి.
కొంత మంది పేర్లు బయటకు వచ్చే సరికి ఉన్న పళంగా..ఇద్దరు మేనేజర్లపై వేటు వేశారని చెబుతున్నారు. మిగతా వారు సేఫ్ అయ్యారని అంటున్నారు. తీగ లాగితే.. మొత్తం వ్యవహారం బయటకు వస్తుందని చెబుతున్నారు కానీ.. ఇప్పటికైతే.. బయట పడకుండా.. పరువు పోకుండా.. వ్యవహారాన్ని ఇక్కడితో ముగిస్తే బాగుంటుదని… యాజమాన్యం అనుకోవడంతో చాలా మంది బయటపడిపోయారని అంటున్నారు. సాక్షి పత్రికలో మొదటి నుంచి కొన్ని వ్యక్తిగత సామ్రాజ్యాలు ఉన్నాయి. ఎవరికి వారు తమ తమ ఆధిపత్యం ప్రదర్శించుకోవడం కోసం ఇతరుల ప్రభావం తగ్గించడానికి వీలైనంతగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఇది బయటపడిందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం.. సాక్షి ఉద్యోగుల్లో విచిత్రమైన చర్చలకు కారణం అవుతోంది.