మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెళ్లొచ్చారు! ఇదే అంశంపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. సాక్షి పత్రికలో ఆయన పాదయాత్ర డైరీ అని ప్రతీరోజూ ఏదో ఒకటి రాస్తుంటారు కదా. 323వ రోజు డైరీలో ఇదే అంశమై ముఖ్యమంత్రి మీద విమర్శలు చేశారు. పెథాయ్ తుఫాను ప్రభావంతో గాలులు వీస్తూ, వర్షం పడుతుంటే… ఆ చినుకుల మధ్యలోంచి తన పాదయాత్ర సాగిందని జగన్ అన్నారు. అయితే, ఈ సందర్భంగా ఆయనకి గత తుఫానులు గుర్తొచ్చాయనీ, ఆ సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు గుర్తొచ్చి తీవ్ర ఆందోళన కలిగిందని జగన్ అభిప్రాయపడ్డారు. ఆ వైఫల్యాల నుంచి ఈ ప్రభుత్వం పాఠాలు నేర్చుకుంటే బాగుంటుంది అనిపించిందన్నారు!
వర్షం అధికం కావడంతో ప్రజలు పడే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని తన పాదయాత్రను అర్థంతరంగా ముగించాల్సి వచ్చిందన్నారు. తుఫాను ప్రభావంతో ప్రజలు భయభ్రాంతులకు గురై, బిక్కుబిక్కుమంటూ ఉంటే… సహాయక చర్యల్ని అనుక్షణం పర్యవేక్షించాల్సిన ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగే ‘సంబరాల్లో’ పాల్గొనడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు? రాష్ట్ర ప్రజల కన్నా రాజకీయ ప్రయోజనాలే మీకు ముఖ్యమా అంటూ నిలదీశారు. అయితే, ఈ డైరీలో.. తాను పాదయాత్రను అర్ధంతరంగా ఆపేయడమే ప్రజా ప్రయోజనకర చర్యగా గొప్పగా రాసుకోవడం విశేషం!
ప్రతీదానికీ రాజకీయంతో లింక్ పెట్టడమే వైకాపా చేస్తుంది. వాస్తవానికి తుఫాను సహాయ చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకోటి, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాల సంబరాలకు సీఎం వెళ్లారు, ఏదో హాలీడే ట్రిప్ కి వెళ్లారనే అర్థం ధ్వనించేలా జగన్ పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆలోచిస్తే.. అది కూడా అవసరమైన కార్యక్రమమే కదా. వచ్చే లోక్ సభ ఎన్నికల తరువాత ఏపీకి న్యాయం చేసే ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడాల్సి ఉంది. దానికి అనుగుణంగా జాతీయ స్థాయిలో భాజపాయేతర రాజకీయ కూటమి కట్టే ఏర్పాట్లలో చంద్రబాబు నాయుడు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి సమయంలో జరిగే సమావేశాలు చాలా కీలకమైనవి. అవేవో సొంత ప్రయోజనాల కోసం జరుగుతున్న కార్యక్రమాలు కావు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ లకు చంద్రబాబు వెళ్లారు. అంతేగానీ, రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే… ఆయనేదో హాలీడే ట్రిప్ కి వెళ్లారన్నట్టుగా జగన్ ప్రొజెక్ట్ చేస్తున్న పరిస్థితి వాస్తవంలో లేదు. తుఫాన్ సమయంలో కూడా రాజకీయ ప్రయోజనాలు అనే కోణమే మాట్లాడుతుంటే ఏమనుకోవాలి..?