హరే రామ్, ఓం లాంటి డిఫరెంట్ కథల్ని ఎంచుకునే కల్యాణ్ రామ్… ‘టపాస్’తో రూటు మార్చాడు. పూర్తిగా కమర్షియల్ సినిమాలకే పెద్ద పీట వేశాడు. అయితే ఆ తరవాత అవీ బెడసి కొట్టడం మొదలెట్టాయి. ఇప్పుడు మళ్లీ తన పాత రూటులోకి వెళ్లి మరో కొత్త కథ ఎంచుకున్నాడు. అదే… ‘118’. గుహన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. షాలినీ పాండే, నివేదా థామస్ కథానాయికలుగా నటించారు. 2019 జనవరిలో ఈ చిత్రం విడుదల అవుతోంది. ఇప్పుడు టీజర్‌ని వదిలారు. ఇదో థ్రిల్లర్ అనే విషయాన్ని చిత్రబృందం ముందే చెప్పింది. ఇప్పుడు టీజర్‌ని కూడా థ్రిల్లింగ్ మూమెంట్స్తోనే కట్ చేసింది. 50 సెకన్ల టీజర్.. చివరి వరకూ గ్రిప్పింగ్‌గా సాగింది. 118 అంటే ఏమిటో.. ఈ టీజర్లో ఓ క్లూ ఇచ్చారు. ‘118’ అనేది రూమ్ నెంబరో, ఖైదీ నెంబరో కాదు. ఇదో టైమ్. అర్థరాత్రి ఒంటిగంట 18 నిమిషాలకు జరిగిన ఘటన.. కథానాయకుడి జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అదేంటన్నదే ఈ సినిమా. క్షణం తరవాత టాలీవుడ్లో ఈ తరహా థ్రిల్లర్స్‌కి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. మరి ‘118’ ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.