ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఏపీ ప్రతిపక్ష పార్టీ రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో పార్లమెంటు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి… ప్రత్యేక హోదా కావాలంటూ నినాదాలు చేశారు. అనంతరం విజయసాయి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయమై తెలుగుదేశం ఎంపీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సభలో టీడీపీ ఎంపీలు నిరసనలు కూడా తెలపడం లేదనీ, కొందరైతే సమావేశాలకు రావడం లేదన్నారు. అంతే, అక్కడితో హోదా అంశమై వైకాపా పోరాటం టాపిక్ అయిపోయింది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శల చేయడం ప్రారంభించారు!
2019 సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలల ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులెత్తేశారన్నారు! గత ఎన్నికల్లో ఆయన ఈవీఎమ్ లను నమ్ముకుని వెళ్లారనీ, వైకాపా కంటే ఐదు లక్షల ఎక్కువ ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారన్నారు. ఈవీఎమ్ లను ట్యాంపర్ చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కానీ, ఈరోజున ఈవీఎమ్ లపై ఆయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారనీ, గడచిన నాలుగేళ్లూ భాజపాతో దోస్తీ ఉన్నంతకాలం దీనిపై ఎందుకు మాట్లాడలేదన్నారు. మరోసారి ఈవీఎమ్ లను మేనేజ్ చేసే అవకాశం భాజపా కల్పించదన్న అపనమ్మకంతోనే ఇలా మాట్లాడుతున్నారని విజయసాయి విమర్శించారు. అంటే, ఎన్నికలకు నాలుగైదు నెలల ముందే తన ఓటమిని ఒప్పుకున్నట్టు అని సీఎంని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
వైకాపా ఎంపీలు పార్లమెంటు ముందు ధర్నాకి దిగింది దేనికీ… హోదా కావాలనే డిమాండ్ తో కదా! మరి, అదే ఆవరణలో మీడియా దగ్గరకు వచ్చేసరికి విజయసాయి మాట్లాడుతున్నదేంటీ… చంద్రబాబు- ఈవీఎమ్ ల గురించి! మరి, ప్రత్యేక హోదా పోరాటం ఏమైనట్టు, కేంద్రాన్ని ఏ రకంగా ఈయన నిలదీస్తున్నట్టు, ఈ ఇద్దరూ ధర్నా ద్వారా భాజపాకి ఇచ్చిన సంకేతాలేంటి… ఇవి కదా మాట్లాడాల్సినవి! ఇవన్నీ వదిలేసి వేరేది మాట్లాడతారేంటి..? ఇంకోటి, టీడీపీ ఎంపీలకు ప్రత్యేక హోదా సాధనపై చిత్తశుద్ధే లేదనేశారు. పార్లమెంటు గత సమావేశాల్లో… ప్రత్యేక హోదా కోసం సభలో మాట్లాడింది ఎవరు..? ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు సభలో ప్రధాని మోడీని నిలదీసిన క్రమం ఎంతగా చర్చనీయం అయిందో గుర్తులేదా..? ఆ మాటకొస్తే… ఇప్పుడు లోక్ సభలో ప్రత్యేక హోదా గురించి వైకాపా తరఫున మాట్లాడటానికి ప్రాతినిధ్యమే లేదు. సరే, తమ ఎంపీలు పదవులను త్యాగం చేశారని వైకాపా నేతలు చెప్పుకుంటారు. మరి, ఆ త్యాగం విజయసాయి రెడ్డి దగ్గరకి వచ్చేసరికి ఎందుకు వర్తించలేదు..? గత పార్లమెంటు సమావేశాలుగానీ, అంతకుముందుగానీ… పార్లమెంటు ఆవరణలో మీడియా ముందు ఏనాడైనా ‘హోదా ఎందుకు ఇవ్వరూ’ అంటూ కేంద్రాన్ని విజయసాయి బల్లగుద్ది నిలదీశారా..?