శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు సిన్సియర్ గా తన పార్టీ అధినేత చంద్రబాబునాయుడుని ఫాలో అయిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన విభజన హామీల్ని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆయన పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద రోజంతా నిరాహారదీక్ష చేశారు. ఈ రోజే ఎందుకు అంటే… రామ్మోహన్ నాయుడు పుట్టిన రోజు అట. సోషల్ మీడియాలో రామ్మోహన్ నాయుడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతూ ఉంటే.. ఆయన దానికి “ఛీర్స్” చెప్పకుండా… పార్లమెంట్ లో నిరాహారదీక్షకు కూర్చుంటున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. సాయంత్రం వరకూ దీక్ష చేశారు. సాయంత్రం విజయనగరం ఎంపీ అశోక్ గజపతి రాజు రామ్మోహన్ నాయుడితో దీక్ష విరమింప చేశారు.
ఇక్కడ చంద్రబాబునాయుడుని సిన్సియర్ ఫాలో చేస్తున్నారని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. పుట్టిన రోజు నాడే దీక్ష చేయడం. గత ఏడాది తన పుట్టిన రోజు నాటి నుంచే.. చంద్రబాబు కేంద్రంపై ధర్మపోరాటం చేశారు. తన పుట్టిన రోజున నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకూ.. ధర్మపోరాట దీక్ష చేశారు. అదే స్ఫూర్తితో .. ఇప్పుడు తన పుట్టిన రోజు సందర్బంగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఒక రోజు నిరాహారదీక్ష చేశారు. పార్లమెంట్ వద్ద జరిగిన ఈ నిరాహారదీక్షలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సాధించేవరకూ విశ్రమించబోమని ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ఆయన పుట్టినరోజు నాడు ధర్మ పోరాట దీక్షను చేశారని.. ఆ స్ఫూర్తితోనే తాను పార్లమెంటులో ఆందోళనకు దిగానన్నారు. పుట్టిన రోజులు వస్తుంటాయి.. పోతుంటాయనీ, కానీ వాటిని ఏ రకంగా వాడుకున్నామన్నదే ముఖ్యమన్నారు. ఏపీ ప్రజల కోసం చేస్తున్న పోరాటం తనకు గుర్తుండిపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కనీసం మానవత్వంతో స్పందిస్తుందన్న ఆశతో తన పుట్టినరోజు నాడు ఆందోళనకు దిగానని ప్రకటించారు. దీక్షలో రామ్మోహన్ నాయుడికి మద్దతుగా టీడీపీ నేతలు గల్లా జయదేవ్, మురళీ మోహన్ పాల్గొన్నారు.
రామ్మోహన్ నాయుడికి మంత్రి నారా లోకేష్ సంఘీభావం ప్రకటించారు. తనతో పాటు ఐదు కోట్ల మంది ప్రజలు మద్దతుగా ఉన్నారని.. లోకేష్ ట్వీట్ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ , వైజాగ్ రైల్వే జోన్ హామీలు అమలు చేయకుండా.. బీజేపీ చెబుతున్న నాటకీయకారణాలు ప్రజల ఆశల్ని వమ్ము చేశాయని లోకేష్ ట్వీట్ లో విమర్శించారు. పార్లమెంట్ లో ఎంపీలు విభజన హామీలను అమలు చేయాలంటూ చేసిన ఆందోళన కారణంగా లోక్ సభ పెద్దగా కార్యకలాపాలేవీ చేపట్టకుండానే వాయిదా పడింది.