కాన్ఫిడెన్స్ పెంచడానికే “బ్లేడ్” సవాల్ చేశానని.. అది కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి .. సెల్ఫ్ గోల్ మారిపోయిందని… కాంగ్రెస్ పార్టీ నేతలగా మారిన కమెడియన్ బండ్ల గణేష్ నాలిక కరుచుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన మొదటి సారి తన బ్లేడ్ సవాల్ పై స్పందించారు. తన చాలెంజ్ నెర వేరకపోవడంతో ఫలితాలనంతరం మీడియా ముందుకు రాకుండా ఉండిపోయారు. ప్రజాకూటమి అధికారంలోకి రాకుంటే గొంతు కోసుకుంటానని అన్ని చానళ్లు తిరిగి సవాల్ చేశారు. టీఆర్పీల కోసం బండ్ల గణేష్ కామెడీ బాగా పని చేస్తూండటంతో.. ఆయన చానళ్లన్నీ.. తర్వాత తమ రియాల్టీలను బండ్ల గణేష్ కేంద్రంగా ప్రారంభించాయి.
కానీ అతను మీడియా కంటపడకుండా జాగ్రత్తపడ్డారు. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత మాత్రం మీడియాను తప్పించుకోలేకపోయారు. అక్కడ కూడా బ్లేడ్ చాలెంజ్ ప్రశ్నలే ఎదురయ్యాయి. దాంతో ” అరే కోపంలో వంద అంటాం సార్.! అవన్నీ నిజం అవుతాయా! మీరు కోసుకోమంటే కోసుకుంటా. చాలా అంటాం ఇవన్నీ మాములే. ఉరికే మావాళ్ల ఉత్సాహం కోసం అలా మాట్లాడాను. ఇప్పుడేం చేయమంటారు. కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది దానికి ఏం చెబుతాం…” అని కవర్ చేసుకున్నారు.
ఎన్నికల సమయంలో బండ్ల గణేష్.. మీడియా చానళ్లకు హాట్ ఫేవరేట్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లుగా ప్రైమ్ టైమ్ లో కూడా ఇంటర్యూలు తీసుకున్నారు. కానీ ఎవరూ.. బండ్లను సీరియస్ గా తీసుకోలేరు. ఆయన చేసిన సవాళ్లనూ కామెడీగానే తీసుకున్నారు. అయితే టీఆర్ఎస్ గెలిచిన తర్వాత.. కొన్ని మీడియా చానళ్లు బ్లేడ్లు తీసుకుని బండ్ల ఇంటికి కూడా వెళ్లడం వివాదాస్పదమయింది. అప్పుడే దళితుడ్ని సీఎంను చేయకపోతే మెడ నరుక్కుంటానన్న కేసీఆర్ సంగతి ఏమిటని బండ్ల ప్రశ్నించినట్లు ప్రచారం జరిగింది.