ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ హోదా అంశమై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దానికి భాజపా సర్కారు ఇచ్చిన సమాధానం ఇది! ఇంకోటి… హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కూడా మరోసారి కేంద్రం తేల్చి చెప్పింది. అంతేకాదు, రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తున్నామని పేర్కొంది. ఈ సందర్భంగా మరోసారి 14వ ఆర్థిక సంఘం నివేదిక ప్రస్థావిస్తూ, దాని ప్రకారమే హోదా ఇవ్వడం కుదరడం లేదని చెప్పడం విశేషం.
నిజానికి, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో హోదా ఇవ్వొద్దని ఎక్కడా లేదని సాక్షాత్తూ ఆ సంఘ సభ్యులే చెప్పినా కూడా భాజపా ఇంకా అదే పాట పాడుతోంది. హోదాకి బదులు ప్యాకేజీ ఇచ్చేశామని అంటున్నారు! ఎక్కడ ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఎంత ఇచ్చారనేది కూడా కేంద్రమే జవాబు చెప్పలేని ప్రశ్న? ఆంధ్రా విషయంలో భాజపా సర్కారు వైఖరి ఎంత మొండిగా ఉందని చెప్పడానికి ఈ సమాధానమే సాక్ష్యం. ఎవరేమనుకున్నా భాజపా వైఖరిలో మార్పు ఉండదని మరోసారి చెప్పినట్టయింది. వాస్తవానికి, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రాలో ప్రత్యేక హోదా అనేదే ప్రధానాంశం అవుతుంది. అయినాసరే, భాజపా వైఖరి ఇలా ఉందంటే… ఆ పార్టీకి ఏపీలో భవిష్యత్తు ఏంటనేది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉండటమే అనుకోవచ్చు.
లోక్ సభ ఎన్నికల్లో ఏపీ నుంచి కొన్నైనా ఎంపీ స్థానాలు దక్కుతాయనే ఆశని భాజపా వదిలేసుకున్నట్టుంది. ఇప్పటికే ప్రజల్లో భాజపా అంటే తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి, ఇప్పటికిప్పుడు ఏపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆ పరిస్థితిలో మార్పు అసాధ్యం. పోనీ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా భాజపా కొంతైనా ప్రభావం చూపగలిగే పరిస్థితి ఉందా అంటే… అది కూడా ఆశాజనకంగా లేదు! పైగా, పక్క రాష్ట్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో హడావుడి చేసినా, ప్రధాని మోడీ, అమిత్ షా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు… ఇంతమందిని దించినా అక్కడ దక్కించి ఒక్క సీటే. భాజపాని మరీ తీవ్రంగా వ్యతిరేకించే కారణాలవీ తెలంగాణలో లేకపోయినా వచ్చిన ఫలితమిది. అక్కడే అలా ఉంటే, ఇక ఆంధ్రాలో ఫలితాలు ఎలా ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే… ప్రత్యేక హోదా అంశంతోపాటు, ఏపీకి సంబంధించి కేంద్ర సాయంపై ఏది మాట్లాడినా ఏమీ తేడా ఉండదనేది భాజపా లెక్కగా కనిపిస్తోంది.